సదావర్తి సత్రవ భూముల కుంభకోణాన్ని వెలికి తీసి తెదేపా ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన వైకాపా, ఇప్పుడు దానిపై ఆసక్తి కోల్పోయినట్లుంది. దానిపై మొదలుపెట్టిన పోరాటాన్ని పక్కనపడేసి ఇప్పుడు ‘గడప గడపకి వైకాపా’ కార్యక్రమంతో వైకాపా బిజీ అయిపోయింది. ఒకవేళ సదావర్తి కుంభకోణంపై వైకాపా తన పోరాటాన్ని కొనసాగించి ఉండి ఉంటే తెదేపా ప్రభుత్వానికి చాలా నష్టం జరిగి ఉండేది. కనుక సదావర్తిని వైకాపా అంతటితో వదిలిపెట్టడం తెదేపాకి చాలా ఉపశమనం కలిగించే విషయమేనని భావించవచ్చు. అందుకే తెదేపా నేతలెవరూ కూడా ఇప్పుడు సదావర్తి ప్రసక్తి తేకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.
వైకాపా ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, బాక్సైట్ త్రవ్వకాలు, కాల్ మనీ, రాజధానిలో బినామీ భూముల కొనుగోళ్ళు, తెలంగాణా ప్రాజెక్టులు వంటి అనేక సమస్యలు, కుంభకోణాలపై పోరాటాలు మొదలుపెట్టి ఏదీ పరిష్కారం కాకుండానే ఒక సమస్య నుంచి మరొకదానికి షిఫ్ట్ అయిపోతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు ఒకే సమస్యపై నిరంతరంగా పోరాడటం అసంభవం. ఎప్పటికప్పుడు సరికొత్త సమస్య లేదా కుంభకోణంతో ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించగలవు. అప్పుడే ప్రభుత్వ అసమర్ధత, అవినీతి గురించి ప్రజలకి తెలియజేసే అవకాశం ఉంటుంది. బహుశః అందుకే వైకాపా కూడా సదావర్తి నుంచి ‘గడప గడపకి వైకాపా’కి షిఫ్ట్ అయిపోయిందని సరిపెట్టుకోవాలి. ఒక సమస్యపై ఎక్కువ రోజులు పోరాటం చేయలేని ప్రతిపక్షాల ఈ వీక్ నెస్ ని ప్రభుత్వం కూడా గుర్తించినట్లే ఉంది కనుక అవి ఓ సమస్యపై పోరాడుతున్నప్పుడే అది కూడా వాటి గురించి మాట్లాడుతుంటుంది. ఆ తరువాత అది కూడా దానిని పక్కన పడేస్తుంటుంది. అధికార, ప్రతిపక్షాలు ఆడుకొనే ఈ రాజకీయ చదరంగంలో చివరికి అన్నివిధాల నష్టపోయేది ప్రజలు, రాష్ట్రమే.