ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ మీద కొన్ని విమర్శలు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి! ఆయన పప్పు అనీ, చాలా ఎదగాలనీ, చాలా నేర్చుకోవాలన్నట్టుగా కొంతమంది నాయకులు విమర్శించిన సందర్భాలూ ఉన్నారు. అయితే, రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజమే. ఎదుటివారి ప్రాధాన్యతను ప్రజల్లో తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటివి చేస్తుంటారు. వీటిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టకపోతే ఇబ్బందే! ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ మధ్య గుర్తించినట్టున్నారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన మాట తీరులో చురుకుదనం పెంచారు. భాజపా సర్కారుపై విమర్శలు చేస్తున్న క్రమంలో పంచ్ లు వేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు పెట్టారు. ఐకిడో ప్రాక్టీస్ చేస్తున్న స్టిల్స్ విడుదల చేశారు. అయితే, ఈ ఫొటోలు బయటకి తేవడం వెనక ఓ కారణం కూడా ఉంది లెండి!
వారం రోజుల కిందట జరిగిన ఓ కార్యక్రమంలో.. రాహుల్ గాంధీతో బాక్సింగ్ క్రీడాకారుడు విజేందర్ సింగ్ మాట్లాడాడు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రిబ్బన్లు కత్తిరించే నాయకుల్నే తాను ఎక్కువగా చూశాననీ, క్రీడల్లో చురుగ్గా ఉన్న నేతలు తనకు కనిపించడం లేదన్నాడు. మీరు ప్రధాని అయ్యాక క్రీడాభివృద్ధి కోసం ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. దీనిపై రాహుల్ స్పందిస్తూ… తాను ప్రతీరోజూ వ్యాయామం చేస్తాననీ, రన్నింగ్, స్విమ్మింగ్ చేస్తానన్నారు. ఇదే సమయంలో తాను ఐకిడో మార్షల్ ఆర్ట్ లో బ్లాక్ బెల్ట్ అని వెల్లడించారు. ఇలాంటి విషయాల గురించి బయట తాను ఎక్కువగా చెప్పుకోను అని కూడా చెప్పుకున్నారు! అయితే, ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనీ, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని విజేందర్ కోరాడు. సో.. దాని ఫలితమే ఈ ఐకిడో ప్రాక్టీస్ ఫొటోలు. కొద్దిరోజుల కిందట తన పెంపుడు కుక్కల ఫొటోలు కూడా బయటకి వచ్చాయండోయ్.
నిజానికి, ఇవన్నీ ఇమేజ్ మార్చుకునే ఫీట్లుగా చూడాలి. రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి, ఆయన అలవాట్ల గురించి గతంలో ఎప్పుడూ పెద్దగా చెప్పుకోలేదు. కానీ, ఇప్పుడు యువతను ఆకర్షించాలంటే తనలోని ఒక డైనమిక్ కోణాన్ని ప్రదర్శించుకోవాలి. మొత్తంగా, తన ఇమేజ్ పై ఉన్న విమర్శల్ని తిప్పి కొట్టాలనే వ్యూహంతో రాహుల్ ఇలాంటివి చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఆ మార్పు రాహుల్ ప్రసంగ శైలిలో కూడా ఈ మధ్య కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తన మాటల్లో పంచ్ డైలాగులు పెంచారు. తప్పదు.. ఎన్నికలు దగ్గరకి వచ్చేస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి కాబట్టి, తనను తాను కొత్తగా, సర్వశక్తి సంపన్నుడిగా, ధీరోదాత్తుడిగా ఆవిష్కరించే ప్రయత్నం రాహుల్ చేయక తప్పదు!