కుట్ర భగ్నమైందనీ, బంద్ విజయవంతమైందనీ వైకాపా నేతలు గొప్పగా చెప్పుకోవచ్చు! ఆంధ్రుల ఆక్రోశంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందంటూ బంద్ వైఫల్యానికి ఇగో శాటిస్ఫై చేసే సాకులు వెతుక్కోవచ్చు. చంద్రబాబు నాయుడుని భావితరాలు క్షమించవంటూ ఆవేశపూరితంగా ఎన్ని ప్రకటనలైనా చెయ్యొచ్చు. కానీ.. వీటన్నింటినీ దాటి వైకాపా అధినేత జగన్ నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠాన్ని బంద్ ఫలితం చాటి చెబుతోంది. కేవలం చంద్రబాబును విమర్శించడమనే కోణాన్ని కాసేపు పక్కనబెట్టి… జీరో ఎమోషన్స్ తో ఆలోచిస్తే వైపాకా ఇచ్చిన ఈ బంద్ పిలుపు అనేది.. నాలుగేళ్ల ప్రతిపక్ష పార్టీ పనితీరుకి ప్రోగ్రెస్ కార్డులా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రధాన ప్రతిపక్షం. ప్రజల సమస్యలే అజెండాలుగా వారికి ఉండాలి. అలాంటప్పుడు, ప్రజల తరఫున చేసే అన్ని పోరాటాలకూ భావసారూపత్య కలిగిన పార్టీలను కలుపుకుని వెళ్లాలి. జగన్ పిలిస్తే పవన్ వస్తారా, మరొకరు రారా అనే చర్చ తరువాత! అసలు పిలవడమంటూ జరగలేదు జగన్ వైపు నుంచి ఉంటే కదా! నాలుగున్నరేళ్లలో ఆంధ్రాలో ప్రతిపక్షాలను… మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర పార్టీలను ఒక వేదికపైకి తేవడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారు.
కేంద్రం కాంగ్రెస్ పార్టీనే ఒక్కసారి చూడండి. ఇతర పార్టీలతో విభేదాలున్నా… ఎప్పటికప్పుడు విందులనీ, ఇతర సమావేశాలనీ కలుపుకునే ధోరణిలోనే ఉంటోంది. భాజపాపై పోరాటం అనేసరికి తమతో ఎంతమంది వస్తారా రారా అనేది పక్కనబెట్టి… అన్ని పార్టీలనూ పిలుచుకుని ముందుకు సాగుతోంది. ఇలాంటి ప్రయత్నం ఆంధ్రాలో జగన్ ఒక్కసారైనా చెయ్యలేదు. నాలుగున్నరేళ్లలో ఇతర పార్టీలతో కలిసి, ప్రజా సమస్యలపై ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా నిర్వహించిన ట్రాక్ రికార్డు లేదు. చంద్రబాబుపై పోరాడితే… ఆ ఫలితం తమకు మాత్రమే దక్కాలన్న రాజకీయ లబ్ధి బుద్ధితోనే ప్రతిపక్ష నేతగా కాలం వెళ్లదీశారే తప్ప… ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్నామనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు.
నిన్నటి బంద్ విషయంలోనూ అదే జరిగింది. తనుకు తానుగా బంద్ నిర్ణయాన్ని ప్రకటించేసి… ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడం లేదని తరువాత వ్యాఖ్యానిస్తే ఏం ప్రయోజనం? టీడీపీని జనసేన వ్యతిరేకిస్తోంది, భాజపా వైరిపక్షంగా చూస్తోంది, కాంగ్రెస్ కూడా పోరాటమంటోంది… అయినాసరే, ఏ ఒక్కరూ వైకాపా చేసిన బంద్ కి మద్దతు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది వైకాపా శ్రేణులు విశ్లేషణ చేసుకుంటే… జగన్ ఒంటెద్దు పోకడలు అనేది చాలాచాలా స్పష్టంగా అర్థమౌతుంది. ఏం చేసినా తమకు మాత్రమే దక్కాలి, ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండకూడదన్న మైండ్ సెట్ తో ఎన్ని పోరాటాలు చేసినా ఏం ప్రయోజనం..? దాన్లో వైకాపా స్వార్థమే కనిపిస్తుంది తప్ప, ప్రజా సమస్యలపై ఉన్న చిత్తశుద్ధి బయటపడదు. మరో ఎన్నికల కోసం ఎదురుచేశారే తప్ప… ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరించారా లేదా అనేది వారే విశ్లేషించుకోవాలి.