ఇటీవల అఖండమైన మెజారిటీ తో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న తొలి నిర్ణయాల్లో ఒకటి ప్రజావేదిక కూల్చేయడం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధికారులతో ప్రభుత్వం సమావేశాలు నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కట్టడం అక్రమమైన కట్టడం గా ప్రస్తుత ప్రభుత్వం భావించడంతో దీన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మీద మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ మిశ్రమ స్పందన సంగతి కాసేపు పక్కన పెడితే, గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన స్వంత కట్టడాన్ని, రెగ్యులరైజ్ చేయించుకున్న వైనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
2005లో తన స్థలాన్ని, అక్రమ కట్టడాన్ని, తన క్యాబినెట్ చేతనే రెగ్యులరైజ్ చేయించుకున్న వైయస్సార్:
బంజర హిల్స్ రోడ్ నెంబర్ 2 లో రాజశేఖర్ రెడ్డి కి ఒక సొంత భవనం ఉండేది. స్థలం , ఆ స్థలంలో ఆయన కట్టుకున్న ఆ కట్టడం నిబంధనలను అతిక్రమిస్తూ ఉండడంతో, ఆ కట్టడాన్ని కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉండింది. అయితే రాజశేఖర్ రెడ్డి ఆ భవనం విషయంలో కోర్టులకు వెళ్లి, భవనం కూల్చివేయబడకుండా చూసుకున్నాడు. ఈలోగా 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారుగా 1,735 చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన ఆ కట్టడాన్ని రెగ్యులరైజ్ చేయించుకోవడం కోసం 2005 లో క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది.
అయితే కేబినెట్ మీటింగ్ లో ఈ అంశం మీద చర్చించే ముందు రాజశేఖర్ రెడ్డి ఆ మీటింగ్ నుండి వెళ్ళిపోయారు. అప్పటి సమాచార శాఖా మంత్రి అయిన షబ్బీర్ అలీ కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్రెడ్డి స్థలాన్ని, ఆ స్థలంలో కట్టుకున్న కట్టడాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. గతంలోని కొన్ని కోర్టుల తీర్పులు ఉటంకిస్తూ వాటన్నింటి ప్రకారం దీన్ని రెగ్యులరైజ్ చేయడం సమంజసమే అంటూ సమర్థించుకున్నారు. అప్పట్లో చదరపు మీటర్ కు వెయ్యి రూపాయల చొప్పున రాజశేఖర్ రెడ్డి డబ్బు కూడా కట్టారు. ఏదిఏమైనా, మొత్తానికి రాజశేఖర రెడ్డికి చెందిన సొంత భవనం రెగ్యులరైజ్ చేయబడింది.
రాజశేఖరరెడ్డి సొంత డబ్బు తో కట్టుకుంటే ఒక రూల్, ప్రజల డబ్బు తో కట్టిన ప్రజావేదిక కి ఇంకొక రూలా?
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి చెందిన స్థలం, ఆ స్థలంలో ఆయన సొంత డబ్బుతో కట్టుకున్న భవనం, నిబంధనలు అతిక్రమించి ఉందని తెలిసినా ప్రభుత్వానికి కొంత డబ్బు కట్టి చివరకు దాన్ని క్రమబద్దీకరించుకున్నారు. మరి ప్రజల డబ్బు తో కట్టిన ప్రజావేదిక కు మాత్రం జగన్మోహన్ రెడ్డి వేరే తరహా న్యాయాన్ని పాటిస్తున్నట్లు గా కనిపిస్తోంది. ప్రజల డబ్బు తో కట్టిన ఈ ప్రజావేదిక ను కూల్చివేసి మళ్లీ అదే ప్రజల డబ్బుతో ఇంకొక కట్టడాన్ని కట్టాలని జగన్ నిర్ణయించడం వెనుక లాజిక్ ఏమిటన్నది ప్రజలకు అర్థం కావడం లేదు. రాజశేఖర్ రెడ్డి సొంత భవనానికి స్వంత డబ్బుకు ఉన్న పాటి విలువ ప్రజల డబ్బుతో కట్టుకున్న కట్టడానికి ఎందుకు లేదన్నది ఇక్కడ ప్రశ్న.
అప్పట్లో జిహెచ్ఎంసి నిబంధనలను అతిక్రమించిన జగన్ లోటస్ పాండ్:
అప్పట్లో ఆంగ్ల పత్రికలలో, జగన్ కి చెందిన లోటస్ పాండ్ అనుమతుల విషయంలో జిహెచ్ఎంసి అధికారి ఒకరు సొంత చొరవ చూపి, బిల్డింగ్ కమిటీకి రిఫర్ చేయవలసిన నిబంధనను బైపాస్ చేసి, అన్నీ అనుమతులను ఆయన దగ్గరుండి ఇప్పించాడని వార్తలు రావడం, జగన్ లోటస్ పాండ్ విషయంలో అతిక్రమించిన నిబంధనల గురించి కొన్ని పత్రికలలో, ఛానెల్స్ లో వార్తలు రావడం తెలిసిందే. అయితే అటు వైయస్ రాజశేఖర్ రెడ్డి కి చెందిన బంజారాహిల్స్ కట్టడం విషయంలో కానీ లోటస్పాండ్ విషయంలో కానీ వర్తించని నిబంధనలు ప్రజల డబ్బుతో ఏర్పాటుచేసిన ప్రజావేదిక కు మాత్రమే వర్తింపచేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కక్ష రాజకీయాలకు ప్రజాధనాన్ని తగల పెట్టడం సమంజసం కాదు:
ప్రజా వేదిక ఏర్పాటు చేయబడిన ప్రాంతానికి దగ్గరలో ఉన్న బిజెపి పార్టీకి సంబంధించిన నేతల భవనాలను కూడా జగన్ కూల్చేస్తాడా లేక ప్రజా వేదిక మాత్రమే కూల్చివేసి బిజెపి నేతల జోలికి వెళ్లకుండా గమ్మున ఉండిపోతాడా అన్న చర్చ కూడా మరొకవైపు జరుగుతోంది. ఏది ఏమైనా రాజకీయ నాయకుల మధ్య ఉండే కక్ష రాజకీయాల కోసం ప్రజల డబ్బుతో ఏర్పాటైన భవనాలను కూల్చివేసి, మళ్లీ ప్రజల డబ్బుతోనే కొత్త భవనాలను నిర్మించడం లాంటి సంప్రదాయం ప్రజలను తికమక పెడుతుంది. మీ కక్ష రాజకీయాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్న ప్రశ్న ప్రజల మనసులలో మెదులుతుంది.
ఏది ఏమైనా ప్రజా వేదిక కూల్చి వేయాలనే జగన్ నిర్ణయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తావిచ్చింది.