కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం ఉద్యమం ప్రారంభించడానికి సిద్దమయినప్పుడు దానిపై అందరికంటే ఎక్కువ ఉత్సాహం, చొరవ చూపిన పార్టీ వైకాపాయే. కాపులపై జగన్మోహన్ రెడ్డికి అభిమానం ఉన్నా లేకపోయినా, శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడనే ఫార్ములాను చాలా నిక్కచ్చిగా పాటిస్తున్న కారణంగా ముద్రగడకు వెనుక నుండి ప్రోత్సహించారు. ఒకవేళ ముద్రగడ మొదలుపెట్టిన ఉద్యమం ప్రశాంతంగా సాగి ఉండి ఉంటే పరిస్థితి వేరేవిధంగా ఉండేది కానీ మొదటిరోజే హింసాయుతంగా మారడంతో వైకాపాకి వ్రతం చెడ్డా ఫలం దక్కకుండా పోయినట్లు అయింది.
తునిలో జరిగిన హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందిస్తూ మొట్ట మొదటగా జగన్మోహన్ రెడ్డినే విమర్శించడం గమనార్హం. దానిని రాజకీయ ఎత్తుగడగానో లేక ఆత్మరక్షణ చర్యగానో కొట్టివేయవచ్చును కానీ ఇంత బారీ విద్వంసం జరిగిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి ముద్రగడను, ఆయన ఉద్యమాన్ని గట్టిగా వెనకేసుకు రావడంతో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఆయనే స్వయంగా దృవీకరించినట్లయింది. ఇది ఒక సెల్ఫ్ గోల్ గా భావించవచ్చును.
నిన్న తునిలో రైలుకి నిప్పు పెట్టబడింది. పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. ఆ దాడిలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టబడింది. జాతీయ రహదారిని, రైల్వే ట్రాక్ ని గంటల తరబడి ఉద్యమకారులు తమ అధీనంలో ఉంచుకొన్నారు. ఇవన్నీ చట్టప్రకారం చాలా తీవ్రమయిన నేరాలేనని అందరికీ తెలుసు. కనుక జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో వాటినన్నిటినీ గట్టిగా ఖండించి ఉండి ఉంటే, అటువంటి సంఘవిద్రోహక చర్యలకు వైకాపా ఎన్నడూ మద్దతు ఈయదని చెప్పినట్లు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో మొక్కుబడిగా జరిగిన సంఘటనలను ఖండించి ఎక్కువ సమయం ఈ వ్యవహారంలో కాపులను ఆకర్షించడం కోసం గట్టిగా ప్రయత్నించారు.
ఈ కుట్ర వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ముఖ్యమంత్రితో సహా తెదేపా నేతలు అందరూ ఆరోపిస్తునప్పుడు, వారి ఆరోపణలు తప్పు, అబద్దాలు అని ఖండించి అందుకు అనుగుణంగా తన వాదనని సాగించి ఉండాలి. కానీ తన ప్రియ శత్రువు చంద్రబాబు నాయుడుని రాజకీయం దెబ్బ మీద దెబ్బ తీయడం కోసం ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని పంటరుణాల మాఫీ మొదలుకొని అనేక హామీల గురించి ప్రస్తావిస్తూ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుని క్రిమినల్ నెంబర్:1 అని ఎందుకు అనకూడదు? అని ప్రశ్నిస్తూ ప్రజలకు తనపట్ల మరింత చులకన భావం ఏర్పడేలా చేసుకొన్నారు.
నిజానికి ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైఫల్యం కొట్టవచ్చినట్లు కనబడుతోంది. దానిని పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రశ్నించలేదు. పైగా తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడని తెదేపా నేతలు వాదనలను నిజమని దృవీకరిస్తున్నట్లు సాగింది జగన్ ప్రసంగం. ముద్రగడ ఉద్యమానికి మద్దతు ఇచ్చి తెదేపా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడుని ఇరకాటంలో పెట్టాలని, కాపులను రతన పార్టీ వైపు ఆకర్షించాలని జగన్ యోచిస్తే, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి మద్దతు ఇస్తున్నట్లు సంకేతం పంపించారు. అంతే కాదు రాష్ట్రంలో ఇతర కులస్తులను, ముఖ్యంగా బీసీలను స్వయంగా దూరం చేసుకొన్నట్లయింది.