ఆంధ్రప్రభుత్వం ఎవరికీ.. ఎక్కడా సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఎక్కడ ఎంత వరకు అవసరం అయితే అంత సమాచారమే ఇచ్చి.. తమ పని పూర్తి చేసుకోవాలనుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం విషయంలో ఇదే స్పష్టంగా బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని సీఎస్ సమీర్ శర్మతోపాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మీడియా ముందుకు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రూ. 62 వేల కోట్ల రెవిన్యూ మాత్రమే ఉందని .. మామూలుగా అయితే కరోనా లేకపోతే రూ. 98వేల కోట్ల ఆదాయం ఉండేదని సమీర్ శర్మ అంచనా వేశాయి.
ఆదాయం ఎలా వస్తుందనేది మనం చేసే పనిని బట్టి ఉంటుంది. పని చేయకుండా, సంపాదనా మార్గాలు మూసేసుకుని.. పన్నులు మాత్రమే పెంచుకుంటూ కూర్చుంటే ఆదాయం పెరగదు. అందుకే ఎంత వస్తుందనే అంచనాలను పక్కన పెడితే.. ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందనే అంశాన్ని పరిశీలిస్తే సీఎస్ చెప్పిందాన్ని చూస్తే ఇంత దారుణమైన అబద్దాలు ఎలా చెబుతారనేది ఉద్యోగులకే కాదు సామాన్యులకూ అర్థం కాని విషయం.
ఆంధ్రప్రదేశ్ ఆదాయం అనూహ్యంగా పెరిగిందని ఆదాయ, వ్యయాల లెక్కలు ఆడిట్ చేసే కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్.. స్పష్టంగా ఇస్తున్న లెక్కల ప్రకారం ఏపీ ప్రభుత్వ ఆదాయం అనూహ్యం పెరిగింది. గత రెండేళ్లలో రాష్ట్ర ఆదాయం ఏకంగా 39శాతం పెరిగిందని కాగ్ స్పష్టం చేసింది. కేవలం ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకూ ప్రభుత్వానికి వచ్చిన రాబడి రూ. 88, 618 కోట్లుగా తేల్చింది. ఏడాదికి వచ్చే ఆదాయమే రూ. అరవై వేల కోట్లని సీఎస్ సమీర్ శర్మ ఎలా చెప్పాడో అర్థం కాని విషయం.
అయితే ప్రభుత్వం తమకు కావాల్సి సమాచారం … తాము చేస్తున్న పనులను సమర్థించుకోడానికి అవసరమైన సమాచారం మాత్రమే బయటకు వెల్లడిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంటే.. కేంద్ర పన్నుల్లో వాటా.. గ్రాంట్స్ కూడా. అవి తిరిగి చెల్లించేవి కావు. ప్రజల పన్నులు కట్టేవి. వాటిని లెక్క వేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మాత్రమే చూపించి… ఉద్యోగుల్ని మభ్యపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఉద్యోగులకు లెక్కలు రావా అని .. నిన్నటిదాకా సామాజిక బాధ్యత ఉందని ప్రభుత్వం మీద తెగ ప్రేమ ఒలకబోసిన వెంకట్రామిరెడ్డి లాంటివాళ్లు అంటున్నారు. కానీ ప్రభుత్వం ఇంత కాలం ప్రజల్ని ఎలా మభ్యపెడుతోందో.. ఇప్పుడు ఉద్యోగుల్ని అలాగే మభ్యపెడుతున్నారు. అందరికీ నిజం తెలుసు. ఎప్పుడు రియలైజ్ అవుతారనేదే కీలకం.