మంత్రివర్గ విస్తరణలో.. జగన్మోహన్ రెడ్డి.. కొన్ని అంచనాలను పటాపంచలు చేశారు. పెద్ద ఎత్తున రెడ్డి సామాజికవర్గం వారికి అవకాసం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే.. ఆ పార్టీకి చెందిన వారే.. అత్యధికంగా.. వైసీపీలో విజయం సాధించారు. మొత్తంగా 51 మంది రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు.. ఉన్నారు. అదీ కాకుండా తనకు అండగా ఉండగా ఉండే వర్గం కూడా అదే. పైగా పదవుల కోసం గట్టిగా పోటీ పడుతున్న వారు కూడా ఎక్కువగా ఆ వర్గం వారే ఉన్నారు. అందుకే.. ఆరేడు మంత్రి పదవులు.. ఆ వర్గానికి కట్టబెడతారని అందరూ అనుకున్నారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. నలుగురుతోనే సరి పెట్టారు.
బీసీలకు చంద్రబాబు ఇచ్చినదాని కన్నా ఒకటి తక్కువే..!
బీసీ వర్గాలకు… టీడీపీ అధినేత చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆయన కేబినెట్లో ఎక్కువగా ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు. చంద్రబాబు కేబినెట్లో… కేఈ కృష్ణమూర్తి(ఉప ముఖ్యమంత్రి), యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర… బీసీ మంత్రులుగా ఉండేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి .. ఏడుగురు బీసీ నేతలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్‌చంద్రబోస్ , మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ , శంకర్ నారాయణ , అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం మంత్రులవుతున్నారు.
కాపులకు చంద్రబాబు ఇచ్చినదానితో సమానం.!
చంద్రబాబు కేబినెట్లో కాపు సామాజికవర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు. నిమ్మకాయల చినరాజప్ప(ఉపముఖ్యమంత్రి), గంటా శ్రీనివాసరావు, పి. నారాయణ , మాణిక్యాలరావు ఉండేవారు. వైసీపీ అధినేత నలుగురు కాపులకు.. కేబినెట్లో చోటు కల్పించారు. బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ , కురసాల శ్రీనివాస్ , ఆళ్ల నాని ఈ జాబితాలో ఉన్నారు.
కమ్మ సామాజికవర్గానికి మూడు లోటు..!
టీడీపీ హయాంలో.. చంద్రబాబు నలుగురు కమ్మ సామాజికవర్గానికి… చెందిన మంత్రులకు చాన్సిచ్చారు. దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, నారా లోకేశ్ మంత్రులుగా ఉండేవారు. జగన్ కేబినెట్లో మాత్రం.. ఒక్క కొడాలి నానికి మాత్రమే అవకాశం దక్కింది.
రెడ్ల నుంచి సేమ్ టు సేమ్..!
రెడ్డి సామాజికవర్గం నుంచి చంద్రబాబు నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ మంత్రులుగా ఉండేవారు. జగన్ కేబినెట్లోనూ నలుగురు రెడ్లకు చాన్సిచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , మేకపాటి గౌతమ్‌రెడ్డి , బాలినేని శ్రీనివాస్ రెడ్డి లు చోటు దక్కించుకున్నారు.
ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన జగన్..!
జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. మొత్తం ఐదుగురు మంత్రులు.. ఎస్సీకేటగిరిలో ఉన్నారు. పినిపే విశ్వరూప్ , తానేటి వనిత , మేకతోటి సుచరిత నారాయణస్వామి , ఆదిమూలం సురేష్ ఉన్నారు. చంద్రబాబు కేబినెట్లో మాల, మాదిగ వర్గాల తరపున ఒక్కొక్కరికే అవకాశం దక్కింది. నక్కా ఆనందబాబు, కేఎస్ జవహర్ మంత్రులుగా ఉన్నారు.
ఇతర అగ్రవర్ణాల్లో చంద్రబాబు.. వైశ్య వర్గానికి చెందిన శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి ఇవ్వగా.. జగన్ అదే వర్గానికి చెందిన వెల్లంపల్లిశ్రీనివాస్కు చాన్సిచ్చారు. వెలమ వర్గానికి చెందిన సుజయ్ కృష్ణ రంగారావు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. జగన్ కేబినెట్లో చోటు దక్కలేదు. కానీ క్షత్రియ వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు చాన్సిచ్చారు. ఎస్టీల తరపు నుంచి జగన్, చంద్రబాబు ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. మైనార్టీల నుంచి కూడా… జగన్, చంద్రబాబు ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు.