ముంబై ఇండియన్స్ జట్టుని ఐదు సార్లు ఛాంపియన్స్ గా నిలబెట్టాడు రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ కెప్టెన్సీ నుంచి తొలగించడం అభిమానులు తట్టుకోలేకపోయారు. యాజమాన్యంపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. చెన్నై జట్టు లో కూడా కెప్టెన్ మార్పు జరిగింది. ధోనినే స్వయంగా తన పగ్గాలని రుతురాజ్ కు అప్పగించాడు. వాళ్ళ మధ్య మంచి వాతావరణం వుంది. టెక్నికల్ గా రుతురాజ్ కెప్టెన్ అయినప్పటికీ ఫీల్డ్ లో ఒరిజినల్ కెప్టన్ ధోనినే అనుకోవాలి. రుతురాజ్ ప్రతి నిర్ణయం ధోని కనుసన్నల్లోనే తీసుకుంటున్నాడు.
ముంబైకి వచ్చేసరికి ఇలా జరగలేదు. రోహిత్‌ను కావాలనే తప్పించిన సంకేతాలు ఇచ్చారు. దీంతో అభిమానులకు కాలింది. వారి కోపాన్ని మైదానాల్లో చూపిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో హార్దిక్‌కు, ముంబయి ఆటగాళ్లకు మధ్య సమన్వయం సరిగ్గా కనిపించలేదు. పైగా ఎప్పుడూ సర్కిల్స్ లో ఫీల్డింగ్ చేసే రోహిత్‌ను బౌండరీ వద్దకు పంపాడు పాండ్య. మామూలుగా పంపితే పర్లేదు.. అప్పుడు పాండ్య ప్రదర్శించిన అహం స్పష్టంగా కనిపించింది. దీంతో మరింత రగిలిపోయారు ఫ్యాన్స్. పాండ్యని దారుణంగా ట్రోల్ చేశారు.
నిజానికి ధోని, విరాట్, రోహిత్… జట్లతో సంబంధం లేకుండా అభిమానుల మనసులో ప్రత్యేకమైన స్థానం పొందిన ఆటగాళ్ళు. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు అభిమానుల మనోభావాలని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ధోని విషయంలో చెన్నై జట్టు ఎంతో సామరస్యంగా మెలిగింది. అదే ముంబై టీంలో కొరవదింది. అయితే జట్టు యాజమాన్యం త్వరగా మేల్కొని అభిమానులకు సామరస్యపూర్వక సంకేతాలు పంపాలి. లేదంటే మైదానంలో అభిమానులు ట్రోలింగ్ కు గురై జట్టు సభ్యులు ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం వుంది.