సినీ సంగీత ప్రపంచంలో ఇళయరాజా కింగ్. మ్యూజిక్ అంటే ఇళయరాజానే. మరో ఆప్షన్ లేదనుకొనే స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న కంపోజరాయన. ఆ సమయంలో ఉనికి చాటుకోవడం చాలా మంది సంగీత దర్శకులకు కష్టమైపోయింది. కానీ ఓ నూనుగు మీసాల కుర్రాడు ఆ ఉదృతిని తట్టుకొని నిలబడ్డాడు. నిండా ఇరవైఏళ్ళు కూడా నిండిన ఆ కుర్రాడు సినీ సంగీతంలో తనదైన ముద్రవేశాడు. అప్పటి వరకూ కీ బోర్డ్ ప్లేయర్ గా చిన్న చిన్న జింగిల్స్ చేసుకుంటూ కాలం గడిపిన ఆ కుర్రాడు.. ‘చిన్ని చిన్ని ఆశ’ అంటూ ఓ పెద్ద చరిత్రనే సృస్టించేశాడు. ఆస్కార్ విజేతగా జాతీ జెండాని రెపరెపలాడించాడు. ‘ఏఆర్ఆర్” గా ఓ బ్రాండ్ అయిపోయాడు రెహ్మాన్.
అలాంటి ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు తమ లైవ్ షోలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ నెలలోనే వీరిద్దరి లైవ్ షోలు హైదరబాద్ లో జరిగాయి. గచ్చిబౌలి స్టేడియం ఈ సంగీత ఝారికి వేదిక అయ్యింది. నవంబర్ మొదటి వారంలో ఇళయరాజా లైవ్ షో జరిగితే.. నిన్న రెహ్మాన్ అలరించాడు. ఈ రెండు షోలు కూడా దేనికి అవే ప్రత్యేకంగా నిలిచాయి. అయితే ఈ ఇద్దరు లెజెండ్స్ షోను ప్లాన్ చేసుకున్న విధానం గురించి చెప్పుకోవాలి.
ఇళయరాజా పాటలు అంటే చెరగని జ్ఞాపకాలు. ఉదహరణకు ఎవరైనా చిన్న వయసులో ‘చంటి”సినిమా పాటలు వినుంటే.. ఆ పాటలు ఇప్పుడు ఎక్కడ విన్నా మళ్ళీ ఆరోజుల్లోకి వెళ్ళిపోతారు. జ్ఞాపకాలు అన్నీ వరుస కట్టేస్తాయి. మనసుపెట్టి వినాలేకానీ గతంతా కళ్ళముందు ఉటుంది. ఆ జ్ఞాపకాల తాలుక మాధుర్యం హృదయాన్ని తాకుతుంది. ఇప్పటికీ ఎవరి ఫోన్ లో చూసిన మెమొరికార్డు లో సగానికి పైన ఇళయరాజా పాటలు వుంటాయి. ఎందుకంటే ఆ పాటలో జీవం ఉటుంది. ఈ సంగతి ఇళయరాజాకు బాగా తెలుసు.
అందుకే ఆయన లైవ్ షో అంటే భారీతనం వుట్టిపడుతుంది. తను కంపోజ్ చేసిన ఒరిజినల్ సాంగ్ తాలూకు ప్లావర్ ను చెడగొట్టారాయన. మొన్న లైవ్ షోలో కూడా ఇదే ఫాలోయ్యారు. ప్రతి పాటను ఒరిజినల్ గా ప్లే చేశారు. ఆయన పాటలో డెప్త్ ఆయన రాసుకున్న సింఫనీ నోట్స్ లో ఉటుంది. సింఫనీ కళాకారులు ఇండియాలో గట్టిగా వెదికితే పదిమంది కూడా దొరకరు. అలాంటిది ఆయన నేరుగా హంగేరి నుండి ఒక పదిహేను మంది కళాకారులను తెప్పించారు. ప్రతి పాటను లైవ్ లో ఒరిజినల్ గా ప్లే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రోగ్రామింగ్ మ్యూజిక్ జోలికి వెళ్ళలేదు. ఆ లైవ్ షో అంతా ప్రోగ్రామింగ్ కాకుండా పూర్తి స్థాయిలో పెర్ఫార్మెన్స్ గా సాగింది. ఇళయరాజా మ్యూజిక్ లో సోల్ ని ఇష్టపడే వారిని కట్టిపడేసింది.
ఇక రెహ్మాన్ లైవ్ షో పూర్తి భిన్నం. ఈ షోలో రెహ్మాన్ తప్పితే చాలా మందికి తెలియని ఫెసులే కనిపించాయి. రాజా షోలో చిత్ర, మనో, సాధన సర్గమ్, కార్తిక, కేకే .. ఇలా పాపులర్ కళాకారులు కనిపించారు. రెహ్మాన్ విషయానికి వచ్చేసరికి ఆయనే స్పెషల్ ఎట్రాక్షన్. ఆయన తప్పితే.. మొత్తం ఎంటీవీ బ్యాచ్. ఆ బ్యాచ్ తో ఇది వరకు చాల లైల్స్ ఇచ్చారాయన. ఇప్పుడు అదే బ్యాచ్ తో సందడి చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఇళయరాజా తో పోల్చుకుంటే రెహ్మాన్ లైవ్ లో ఆర్కెస్ట్రా పెద్దగా కనిపించలేదు. దీనికి కారణం వుంది. ఎంటీవీతో ఆయన కలసి చేస్తున్న లైవ్ ఇది. అలాగే తన మ్యూజిక్ స్కూల్ స్టూడెంట్స్ కి కూడా ఇందులో సత్తా నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చాడు.
అయితే షోని, అందులో పాడే పాటలను డిజైన్ చేసుకోవడంలో రెహ్మాన్ సక్సెస్ అయ్యాడు. రెహ్మాన్ పాటలు అంటే అదిరిపోయే ఆర్కెస్ట్రా ఉంటుంది. చాలా లేయర్స్ లో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతుంటాయి. అవన్నీ లైవ్ లో చేయడం అంతా తేలికకాదు. చాలా మంది కళాకారులు కావాలి. అందుకే ఆయన బీట్ ప్రధానంగా వుండే పాటలను ఎంచుకున్నాడు. పాటలను సిగ్మేంట్స్ గా విడదీసేశాడు. మెలోడీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లు, కంప్లీట్ సాంగ్స్.. ఇలా ఐదారు కేటగిరీలు చేశాడు. ఒరిజినల్ ప్లావర్ తీసుకురావాలని ట్రై చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే.. తన పాటలను మళ్ళీ కొత్తగా వినిపించేశాడు. ముఖ్యంగా ఆ డ్రమ్స్ యువతను కిర్రెకించేశాయి.
ఇళయరాజా అయితే ”మీకోసం.. నా తెలుగు ప్రేక్షకుల కోసం” ప్రత్యేకం ఈ షో అని చెప్పారు. షో కూడా దాదాపు తెలుగు పాటలతోనే సాగింది. కానీ రెహ్మాన్ మాత్రం .. కాసేపు మనం ముంబాయిలో వున్నామా ? అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు. చాలా వరకూ బాలీవుడ్ పాటలే. రోజా,సఖి, 24, పులి.. దొంగ దొంగ.. సినిమాల్లో ఓ ఐదు తెలుగు పాటలు తప్పితే.. మిగతావన్నీ బాలీవుడ్ , తమిళ లిరిక్స్ తో సాగాయి. కానీ అదిరిపోయాయి.
ఆడియన్స్ అభిరుచి మారుపోతున్న కాలమిది. ఎదో ఒక కొత్తదనం వుండాలి. ఈ రెహ్మాన్ షోలో ఆ కొత్తదనం కనిపించింది. నిజానికి మ్యూజిక్ షో అంటే మ్యూజిక్ వుంటే సరిపోతుంది. కానీ కాలం మారింది కదా.. అలా ఫ్లాట్ గా వుంటే ఎక్కడో చోట బోర్ కొట్టేస్తుంది. అందుకే ప్రతి పాటకు స్టేజ్ పై కొత్త కొత్త కలరింగ్ కనిపించింది. లైటింగ్ మొదలుకొని, డ్యాన్స్ లు, గ్రాఫిక్స్ , లేజర్ లైట్లు, బాణా సంచా.. ఇలా కన్నుల విందుగా కనిపించింది రెహ్మాన్ షో.
మొత్తనికి ఇళయరాజా ఒరిజనల్ ఫ్లావర్ తో ఆకట్టుకుంటే.. రెహ్మాన్ ట్రెండీగా సరికొత్త హంగులతో అలరించాడు.