సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం… ఈమధ్య భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టిన చిత్రాలివి. విడుదలకు ముందు వీటికొచ్చిన హైప్ చూస్తే ఏ రెండొందల కోట్లో పట్టుకెళ్లిపోవడం ఖాయం అన్నంత భరోసా కలిగింది. తీరా చూస్తే డిజాస్టర్ల జాబితాలో వీటి పేర్లు నిలబడిపోయాయి. అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. అయితే.. ఒక విధంగాచూస్తే బ్రహ్మోత్సవం కంటే సర్దార్ నే కాస్త బెస్టు. బ్రహ్మోత్సవంపై వస్తున్న ఇన్ని విమర్శలు, సెటైర్లు… సర్దార్కి రాలేదు. ‘అట్టర్ ఫ్లాప్ ‘ అని ఒక్క ముక్కలో తేల్చేశారు. కానీ.. బ్రహ్మోత్సవం అలా కాదు. నెటింజన్లు ఈ సినిమాని ఇప్పటికీ చీల్చి చండాడుతున్నారు. వసూళ్ల పరంగానూ సర్దార్నే గ్రేట్. తొలిరోజు వసూళ్లలో బాహుబలిని క్రాస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్ కల్యాణ్. తొలి మూడు రోజుల్లో రూ.50 కోట్లు దాటేశాడు.
కానీ.. బ్రహ్మోత్సవం సీన్ రివర్స్ అయ్యింది. ఫ్లాప్ టాక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో… జనాలు థియేటర్ల దగ్గరకు వెళ్లడానికి జంకారు. దాంతో వసూళ్లు బాగా పడిపోయాయి. తొలి రోజు వసూళ్లకీ, ఆ తరవాతి రెండు రోజుల వసూళ్లకీ చాలా తేడా ఉంది. పవన్ సినిమా కేవలం పవర్ స్టామినాతో, స్టార్ డమ్తో ఆ మాత్రం వసూళ్లయినా తెచ్చుకోగలిగింది. అయితే మహేష్ లో అదొక్కటే కొరవడింది. మహేష్ గ్లామర్, అతని క్రేజ్ వసూళ్లు తీసుకురాలేకపోతున్నాయి. అందుకే ఈ విషయంలతో మహేష్ కంటే పవనే బెటర్ అన్న టాక్ వినిపిస్తోంది.