2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలనూ తుంగలో తొక్కేశారు చంద్రబాబు, నరేంద్రమోడీ. ఓటేసే వరకూ ఓటు మల్లన్న…ఓటు అవసరం తీరగానే బోడిమల్లన్న తరహాలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులిద్దరూ కూడా ‘రాజకీయం’ చేశారు. దేశం విషయం పక్కన పెట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లతో బాబు, మోడీ చేసిన రాజకీయం గురించి చెప్పాలంటే మాత్రం మోసం, వంచన లాంటి పదాలు సరిపోవు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలన్నది వెంకయ్య. ఆ క్రెడిట్ మొత్తం వెంకయ్యకు కట్టబెట్టింది టిడిపి అనుకూల మీడియా. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో నన్ను గెలిపిస్తే పదిహేనేళ్ళ పాటు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చింది చంద్రబాబు. ప్రత్యేక హోదా అద్భుతం…అక్షయ పాత్రలాంటిది అనే రేంజ్లో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదానే సర్వస్వం, అదే ప్రాణాధారం అని ప్రజలు నమ్మించింది, ఆశలు రేకెత్తించింది కూడా టిడిపి, బిజెపి నాయకులు, వాళ్ళ అనుకూల మీడియా సంస్థలే. వ్యూహం వర్కవుట్ అయి బాబు, మోడీలిద్దరూ కూడా అధికారంలోకి వచ్చారు.
చంద్రబాబు, జగన్ పార్టీలు ఉండగా బిజెపికి ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా ఎదిగే ఛాన్సే లేదు. అలా జరగాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఆ క్రెడిట్ మొత్తాన్ని చంద్రబాబు తీసుకెళ్ళిపోడన్న గ్యారెంటీ లేదు. అందుకే బిజెపి వ్యూహకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఓటుకు నోటు కేసుతో పాటు, రాజధాని భూముల వ్యవహారం, జగన్‌ని మోడీకి దూరంగా ఉంచడంలాంటి ఎన్నో వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా బిజెపి ఏం చేసినా; ఏమీ చేయకపోయినా చంద్రబాబు ఏమీ మాట్లాడడు. ఇంకా చెప్పాలంటే బిజెపిని సమర్థించడానికి మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. ప్యాకేజీని ప్రకటించిన మరుక్షణమే, అర్థరాత్రి సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘అద్భుతః’ అని తానే ముందుగా భజన చేయడం అందులో భాగమే. దాదాపు మూడేళ్ళు పూర్తి కావస్తున్న వేళ పోలవరం ప్రాజెక్ట్‌కి రెండువేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తే……ఆ అప్పే పరమాన్నం అనే స్థాయిలో టిడిపి నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా మొత్తం కూడా పరమానందభరితంగా భజన చేయడానికి కూడా వెనుకాడలేదు.
జల్లికట్టు స్ఫూర్తితో కెవిపి, చలసాని, శివాజీ, పవన్, వైకాపాలతో పాటు ఇంకా చాలా మంది ప్రత్యేక హోదా కోసం కూడా గట్టిగా పోరాడాలన్న పిలుపును అయితే ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ యువత కూడా పోరాటం దిశగా ఆలోచిస్తోంది. వాళ్ళ ఆలోచనలు తెలుసుకున్న టిడిపి నాయకులు వెంటనే రంగంలోకి దిగిపోయారు. యనమల రామకృష్ణుడితో సహా అందరూ తలా ఒక ప్రకటన చేసిపడేశారు. వాళ్ళ మాటల సారాంశం ఒక్కటే. ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్న దిశగా ఆలోచన చేస్తున్న అంరదూ కూడా ఆ ప్రయత్నాలను మానుకోండి. కేంద్రప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు, పోరాటం చెయ్యొద్దు అన్న సందేశాన్ని వినిపించడమే. ఇప్పటికి నాయకుల మేనేజ్మెంట్ అయింది. ఇక రేపట్నుంచి వెంకయ్య, చంద్రబాబు, టిడిపి అనుకూల మీడియాలు రంగంలోకి దిగుతారనడంలో సందేహం లేదు. వీధుల్లో పోరాడితే ఎన్ని నష్టాలు ఉంటాయో? ట్రాఫిక్ జాం వళ్ళ ఎన్ని ఇబ్బందులు ఉంటాయో? రాష్ట్రానికి రావడానికి రెడీగా ఉన్న లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలు ఎంతమంది ఈ ఉద్యమం పుణ్యమా అని వెనక్కిపోయారో వాళ్ళకి తోచింది చెప్పేస్తారు. ఫైనల్‌గా మోడీని విమర్శిస్తే ఇప్పుడు ఇస్తున్న బిచ్చం కూడా ఇవ్వడు అని బెదిరిస్తారు. అధికార బలగం, మీడియా బలం మొత్తం ఒక్కటయిపోయినప్పుడు ఏ పౌరులు మాత్రం ఎంత వరకూ పోరాడగలరు? తమిళనాడు పోలీసులు, ప్రభుత్వం, మీడియా, సెలబ్రిటీలు అక్కడి యువతకు సహకరించినట్టుగా ఇక్కడ కూడా ముందుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ యువతరం సత్తా ఏంటో? తమిళ యువతకు ఉన్న శక్తి సామర్థ్యాలు, పోరాడాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా ఉన్నాయి. తేడా అంతా కూడా ప్రభుత్వ పెద్దలు, ఆర్థిక పెద్దలు, సినిమా పెద్దల్లోనే ఉంది. కాదని ఎవరైనా చెెప్పగలరా?