రెండు తెలుగు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి నేటితో రెండేళ్ళు పూర్తయింది. రెండు ప్రభుత్వాలకు రెండేళ్ళ పాలన కూడా పూర్తయింది. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణాలో చాలా ఘనంగా సంబరాలు చేసుకొంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాని, గవర్నర్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకోవడం లేదు. దానికి బదులుగా నవనిర్మాణ దీక్షలు చేసుకొంటోంది కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎవరూ శుభాకాంక్షలు తెలపడం లేదు. ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంత విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందో ఎవరికీ తెలియదు.
రెండేళ్ళు పూర్తయిన సదర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రెండేళ్ళలోనే పార్టీపై, ప్రభుత్వంపై, రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించి, రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పధంలో తీసుకుపోతున్నారు కనుక ఆయన ప్రతీ మాటలో ఆత్మవిశాసం తొణికిసలాడుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలలో ఆవేదన, అసహనం, కష్టాలు, సమస్యలు పాలే ఎక్కువగా వినపడింది.
“మొదట లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్న మనం ఇప్పుడు తడబడుతూ అడుగులు వేయగలుగుతున్నామని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా ముందుకే సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మంచి అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాత్కాలిక పనులు, కట్టడాల కోసం తన విమానయానాల కోసం ప్రజాధనాన్ని దుబారా చేయడం గురించి ప్రశ్నించగా చెట్టు క్రింద కూర్చొని పనిచేస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ రారు కదా? విదేశాలకి, డిల్లీకి విమానంలో కాకుండా నడుచుకొంటూనో లేకపోతే రైల్లోనో వెళ్ళలేము కదా…అని అసహనం వ్యక్తం చేశారు..గట్టిగా సమర్ధించుకొన్నారు.
ఆయన ఆవిధంగా మట్లాడటం సహజమే కానీ తన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకొంటున్నారు? తను సరి అనుకొంటున్న వాటిని ప్రజలు కూడా సరైనవేనని అనుకొంటున్నారా? సింగపూర్ వంటి రాజధాని నిర్మించి చూపిస్తానని చెప్పి, ఐదేళ్ళ తరువాత ఈ కష్టాల పాటలు పాడితే ప్రజలు వింటారా? అని ఆలోచించుకోవడం మంచిది. విభజన కారణంగా రాష్ట్రానికి వచ్చిన సమస్యలన్నిటినీ కేవలం తాను మాత్రమే పరిష్కరించగలనని, సంక్షోభం నుంచి అవకాశాలను సృష్టించుకొనే నేర్పు తనకి ఉందని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ఈవిధంగా బేలగా మాట్లాడటం ఆయనకి శోభనీయదు. అధికారం చేపట్టి రెండేళ్ళయిన తరువాత కూడా ఆయన ఇంకా ఎవరినో నిందిస్తూ కూర్చొంటే ప్రజలు దానిని ఆయన వైఫల్యంగానే భావిస్తారని గ్రహిస్తే మంచిది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందిందని గట్టిగా చేస్తున్న ప్రచారం వలన ప్రజలు ప్రభావితం కాకుండా ఉంటారా? అని తెదేపా ప్రభుత్వం అలోచించుకొనికొంటే మంచిది.