చిరంజీవి – రాజశేఖర్.. వీరిద్దరిదీ టామ్ అండ్ జెర్రీ అనుబంధం. ఇది వరకు బాగానే ఉండేవారు కానీ.. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టాక, ఆ పార్టీపై రాజశేఖర్ కామెంట్లు చేశాక… ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ పూడినట్టే పూడి.. పెరిగిపోవడం అలవాటుగా మారింది. మొన్నటికి మొన్న `మా` వివాదం విషయంలో… ఓ ప్రెస్ మీట్లో, ఛానల్స్ అన్నీ లైవ్‌లో ఉండగా, చిరంజీవి సమక్షంలో.. రాజశేఖర్ ఎర్రజెండా ఎగరేయడం, దాంతో.. రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్చలు తీసుకోవాలని చిరంజీవి `మా` పెద్దల్ని కోరడం.. చర్చనీయాంశమైంది. అప్పటి నుంచీ.. ఈ గ్యాప్ ఇంకాస్త పెద్దదైంది.
ఇప్పుడు ఈ గ్యాప్‌ని పూడ్చడానికి అల్లు అరవింద్ ముందుకొచ్చినట్టు సమాచారం. రాజశేఖర్‌తో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇది వరకు పలాస దర్శకుడు కరుణ కుమార్‌కి గీతా ఆర్డ్స్ అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. గీతా ఆర్ట్స్ అంటే…. ఓరకంగా చిరంజీవి సొంత సంస్థ. సో.. `మా మధ్య ఏం లేదు…` అని చెప్పుకోవడానికి అటు చిరంజీవికి, ఇటు రాజశేఖర్‌కీ ఇదో చక్కటి అవకాశం. నిజానికి గీతా ఆర్ట్స్ యువ హీరోలతో, ఫామ్ లో ఉన్న హీరోలతో సినిమాలు చేస్తుంటుంది. తొలిసారి ఆ నిబంధనల్ని పక్కన పెట్టి, ఫ్లాప్ హీరో రాజశేఖర్ హీరోగా సినిమా చేయడంలో ఆంతర్యం ఫిల్మ్‌నగర్ పెద్దలకు అర్థం కావడం లేదు. నిజంగా గీతా ఆర్ట్స్ లో రాజశేఖర్ సినిమా చేస్తే.. మెగా ప్యాచప్ దాదాపు సక్సెస్ అయినట్టే.