ఢిల్లీలో అధికారాల వివాదం టీవీ సీరియల్ లా సాగుతోంది. తాజాగా మహిళా కమిషన్ నియామకం సస్పెన్స్ థ్రిల్ల్రర్ ను తలపిస్తోంది. తన అనుమతి లేకుండా జరిపిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నియామకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నజీవ్ జంగ్ రద్దు చేశారు. రాజ్యాంగా ప్రకారం కొన్ని అంశాల్లో నేనే సుప్రీం అంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లేఖ కూడా రాశారు. అంతేకాదు, కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ నేమ్ ప్లేట్ మాయమైంది. కొన్ని గదులకు తాళాలు పడ్డాయి.
ఇక్కడ రెండు విషయాలు పరిశీలించాలి. మొదటిది, కేజ్రీవాల్ వైఖరి. సాధారణంగా పూర్తి స్థాయి రాష్ట్రాల్లోనే కొన్ని సంస్థల పాలకవర్గాలను ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ నియమిస్తారు. అది రాజ్యాంగం ప్రకారం సంప్రదాయం. గవర్నర్ కు ఫైల్ ఎందుకు పంపాలని ఏ ముఖ్యమంత్రీ తగాదా పెట్టుకోరు. అలాంటిది, పూర్తి స్థాయి రాష్ట్రం కాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇంకా ఎక్కువ అధికారాలుంటాయి. అవి రాజ్యాంగం ప్రకారం సంక్రమించాయి. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ పరీక్ష పాసైన కేజ్రీవాల్ కు ఈ విషయం తెలియనిది కాదు. కాబట్టి, మహిళా కమిషన్ విషయంలో తన సిఫార్సును జంగ్ కు పంపి మర్యాద పాటించి ఉంటే ఆయనే సంతకం చేసేవారు. ఊహూ, ఆయనకు ఫైలెందుకు పంపాలని తానే నియామం జరిపారు. ఇప్పుడు వివాదం ముదిరింది.
ఢిల్లీలో, భూమి, శాంతిభద్రతల వంటివి కేంద్రం పరిధిలో ఉంటాయి. అలాగే, రాష్ట్ర స్థాయి సంస్థలకు నియామకాలు, ఉన్నతాధికారుల నియామకాలు, బదిలీలపై ఎల్ జి దే తుది నిర్ణయం. అయితే ప్రభుత్వ సిఫార్సును పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం సిఫార్సే చేయకుండా ఎల్ జి అధికారాలను ధిక్కరిస్తోంది. దీంతో జంగ్ తన పవర్ ఏమిటో చూపిస్తున్నారు. జంగ్ అంటే యుద్ధం. ఢిల్లీలో వ్యవహారం యుద్ధంలాగే ఉంది.
ఇక రెండో విషయం, బీజేపీ వైఖరి. ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా చేయాలని కొన్ని దశాబ్దాలుగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. గతంలో తాను కేంద్రంలో ఉన్నప్పుడు మాత్రం ఆ పని చేయలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఒకప్పుడు తాను డిమాండ్ చేసిన పనిని పూర్తి చేయడానికి అధికారం ఉంది. పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చాలని కేజ్రీవాల్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పోలీసు శాఖపై అజమాయిషీ లేకపోతే శాంతిభద్రతల పరిక్షణ ఎలా? ఇంత పెద్ద దేశంలో శాంతిభద్రతల అంశాన్ని పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్రంపై పూర్తిగా శ్రద్ధ పెట్టడం సాధ్యం కాదు. అందుకే ఢిల్లీ పోలీసు శాఖలో అవినీతి, అలసత్వం పెరిగాయని ఆరోపణలున్నాయి. అదే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే నిరంతరం నిఘా ఉంటుంది. మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తిస్తుందేమో చూడాలి.