మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు! అవే అలకలు, అవే ఆధిపత్య పోరు. మరీ ముఖ్యంగా సీనియర్ల వైఖరిలో అస్సలు మార్పులేదని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. పార్టీలో తమకు ప్రాధాన్యత సరిపోవడం లేదనీ, కావాలనే తమని పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మరోసారి హైకమాండ్ కి కొందరు సీనియర్లు ఫిర్యాదు చేశారట! మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల భాజపాకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందనీ, ఈ విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసినా కూడా పట్టించుకోవడం లేదంటూ ఆ ఫిర్యాదులో కొందరు సీనియర్లు పేర్కొన్నారని తెలుస్తోంది. దీంతో సీనియర్లపై పార్టీ కీలక నేతలు గుర్రుగా ఉన్నారని సమచారం. ఈ కారణంతోనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి సీనియర్లను ఆహ్వానించలేదని వినిపిస్తోంది.
ఉత్తమ్ ఇంట్లో జరిగిన మీటింగ్ ఏంటంటే… త్వరలో సహకార సంఘాలకు ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎలా వ్యవహరించాలనేది చర్చించేందుకు నేతలతో ఉత్తమ్ ఇంట్లో భేటీ జరిగింది. కనీసం ఈ ఎన్నికల్లోనైనా పార్టీకి కొంత ఊరట కలిగించే ఫలితాలను రాబట్టాలనే వ్యూహంపై చర్చించారు. అయితే, ఈ సమావేశానికి కొంతమంది సీనియర్ నేతల్ని ఆహ్వానించలేదు. కీలకమైన సమావేశాలకు తమను పిలవకపోతే ఎలా అనేది సీనియర్ల ప్రశ్న. అయితే, వారిని పిలిస్తే… విమర్శలు మాత్రమే చేస్తారనీ, సొంత పార్టీ అని చూడకుండా నాయకత్వం తీరును తప్పుబడుతూ ఉంటారనీ, దీంతో సమావేశం రసాభాసగా మారుతుందనీ, పార్టీ వ్యూహరచన కంటే తప్పుల్ని విమర్శించేందుకే సీనియర్లు ఎక్కువగా ప్రయత్నిస్తారనీ… అందుకే కొందర్ని పిలవలేదు అనేది పార్టీ నేతలు అభిప్రాయంగా తెలుస్తోంది.
నిజానికి, మున్సిపల్ ఎన్నికల ముందు కూడా వీహెచ్, పొన్నాల లాంటి సీనియర్ నేతలు ఉత్తమ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలవారీగా పార్టీ బాధ్యతలు చూసుకోవాలీ అంటూ కొందరు సీనియర్లకు అప్పగిస్తే… తాము రాష్ట్రస్థాయి నాయకులమనీ, గల్లీ స్థాయి పనులు చెబుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ తరఫున బలంగా ప్రచారం చేయాల్సిన ఆ సమయంలో వీరి అలకలూ ఆగ్రహాలకే కొంత సమయం వృథా అయిపోయింది. అదే పునరావృతం కావొద్దు అనే ఉద్దేశంతో కొందర్ని తాత్కాలికంగా దూరం పెట్టామనేది ఉత్తమ్ వర్గం అభిప్రాయం. అయితే, ఇదీ సమర్థనీయం కాదు. అందర్నీ కలుపుకుని వెళ్లే ధోరణిలో నాయకత్వం ఉండాలి. అదే సమయంలో… సీనియర్లు కూడా ఇంకా సొంత నేతల మీద హైకమాండ్ కి ఫిర్యాదుల ధోరణీ తగ్గించుకోవాలి. టి. కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో తెలీదు!