అమరావతిలో రూ. 30వేల కోట్ల దుబారా జరిగిందని.. సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు రేమండ్ పీటర్ నేతృత్వంలో నియమితులైన కమిటీ రిపోర్ట్ ఇవ్వడంపై అధికారవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. అమరావతిలో ఇప్పటి వరకూ జరిగిన పనుల విలువ రూ. తొమ్మిది వేల కోట్ల లోపునే ఉంది. రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ లో మౌలిక వసతుల కల్పన, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్ అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగులు, వివిధ శాఖల అధిపతులు, నాల్గో తరగతి ఉద్యోగులు, హైకోర్ట్, మంత్రుల నివాసాలు, జడ్జిల నివాసాలు, సెక్రటేరియట్ టవర్లు, రాజధానిలో రహదారుల నిర్మాణాలకు సుమారు రూ. 52 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇందులో రూ. 8 వేల 445 కోట్ల రూపాయలకు ఇప్పటి వరకు ఖర్చు చేశారు.
దీన్ని కొత్త ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సీఆర్డీఏ రిపోర్టులో ఈ వివరాలన్నీ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం పనులన్నింటినీ నిలిపివేసింది. దాంతో ఖర్చు కూా ఆగిపోయింది. ఇప్పటికే అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల నివాస భవన సముదాయాలు దాదాపుగా పూర్తయ్యాయి. సీడ్ యాక్సెస్ రహదారితోపాటు మరికొన్ని రహదారులు కూడా 80 శాతం వరకు పూర్తయ్యాయి.సెక్రటేరియట్ టవర్లు, హైకోర్ట్, మంత్రుల నివాస గృహాలు, జడ్జిల క్వార్టర్లకు పనాదులు పడ్డాయి. పలు నిర్మాణాలు జరిగాయి. వీటన్నింటినీ దుబారా లెక్కలో వేసుకున్నా… రూ. 9 వేల కోట్లే అవుతుంది కానీ.. రూ. 30 వేల కోట్లు ఎలా అవుతుందన్న చర్చ నడుస్తోంది.
రాజధానిగా అమరావతిని మార్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. కొత్తగా రాజధాని కోసమంటూ… ఓ కమిటీని నియమించడం… అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని రాజధానిని నిర్మిస్తామని మంత్రి బొత్స ప్రకటించడం అంతా వ్యూహాత్మకంగా జరుగుతోందంటున్నారు. అందుకే దుబారా పేరుతో.. కొత్త ప్రచారం మొదలు పెట్టారంటున్నారు.