హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. యాదగిరిగుట్టను జిల్లాగా చేయాలనే డిమాండ్‌తో పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఇవాళ ఒక్కరోజుపాటు నిరాహార దీక్ష చేశారు. మోత్కుపల్లి ఇవాళ గుట్టలోని వైకుంఠ ద్వారంనుంచి ఎమ్ఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు. ఆ దీక్షకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత ఎర్రబెల్లి కూడా మద్దతిచ్చారు. అయితే మరో సీనియర్ నేత ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఆ వాదనను వ్యతిరేకించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ, పుణ్యక్షేత్రాలను జిల్లాగా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కొంతమంది స్వప్రయోజనాలకోసం వారి ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని పట్టుబడుతున్నారంటూ పరోక్షంగా మోత్కుపల్లికి చురకలు అంటించారు. భువనగిరిని జిల్లాగా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తాను ప్రజలకోసం ఈ డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. నిజాం కాలంలోనే భువనగిరి జిల్లాగా ఉందని అన్నారు. పాలనా సౌలభ్యంకోసం తాను మాట్లాడుతున్నానని చెప్పారు. తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయని, వాటి కేంద్రాలను జిల్లాలుగా చేస్తే సరిపోతుందని అన్నారు. పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉమా మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఈ వివాదంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏమీ వ్యాఖ్యానిస్తారో చూడాలి. మొత్తం మీద తెలంగాణ తెలుగుదేశం వ్యవహారాలు గాడిలో సాగటంలేదని అర్థమవుతోంది.