ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా ఈనాడు మీడియాపైన ఉన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఈనాడు ఇచ్చిన సపోర్ట్‌తోనే ఎన్టీఆర్‌కి అధికారం దక్కిందని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. 1994లో టిడిపి అధికారంలోకి రావడంలో కూడా ఈనాడు పాత్ర అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ని గద్దెదించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడంలో రామోజీరావు పోషించిన పాత్ర గురించి వచ్చిన విమర్శలకైతే లెక్కేలేదు. ఎన్టీఆర్ కూడా చంద్రబాబుతో పాటు రామోజీరావును కూడా ఓ స్థాయిలో ఘాటుగానే విమర్శించాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అయితే ఈనాడు మూలాలను దెబ్బకొట్టాలని చూశాడు. ఈనాడుకు ఉన్న విశ్వసనీయతను దెబ్బకొట్టాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశాడు. టిడిపి కరపత్రిక ఈనాడు అని చెప్పి ప్రతి తెలుగువాడికి తెలియచేయాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని చాలా మంది ప్రజలు నమ్మారు కూడా. అంతటి తీవ్రస్థాయి ఆరోపణలు ఎదుర్కున్న ఏ మీడియా సంస్థ అయినా కచ్చితంగా ఒడిదుడుకులకు గురవ్వాలి. కానీ ఈనాడు మాత్రం గట్టిగా నిలబడింది. ఈనాడును దెబ్బకొట్టడం కోసమే వైఎస్ ఫ్యామిలీ సాక్షి మీడియాను రంగంలోకి దించింది. ఈనాడు కంటే ఎక్కువ క్వాలిటీ, ఈనాడు కంటే ఎక్కువ ఖర్చు, ఈనాడు కంటే ఎక్కువ జీతాలంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సాక్షి మీడియా ఈనాడును టచ్ చేయలేకపోయింది. రాజకీయంగా కూడా చంద్రబాబుకు ఈనాడు చేసిన స్థాయి సాయం…జగన్‌కి సాక్షివారు చెయ్యలేకపోయారు. 2014లో జగన్ ఓటమికి సాక్షి మీడియా కూడా ఓ కారణం అని వైకాపా నాయకులే అంతర్గతంగా ఆరోపణలు చేస్తూ ఉంటారు.
రాజకీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో కూడా ఈనాడుతో పోటీపడలేకపోయిన సాక్షి ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో పూర్తిగా వెనుకబడుతోంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ప్రజాదరణ తగ్గిపోతుందని, సాక్షికి భయకంరంగా పెరుగుతుందని సాక్షిలో పనిచేసే కిందిస్థాయి జర్నలిస్టులు కూడా వాళ్ళకు తోచిన వాదనలు వినిపించారు. కానీ అదేమీ జరగలేదు. ఈనాడు ప్రజాదరణ చెక్కుచెదరలేదు. దానికి సమాధానం గత రెండు రోజుల ఈనాడు పేపర్ చదివిన వాళ్ళందరికీ అర్థమైపోయింది. సాక్షి మీడియా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది కానీ ప్రజల తరపున పనిచేస్తోంది మాత్రం తక్కువ. ఎంతసేపూ జగన్‌ని హైలైట్ చేయడమే సాక్షివారికి సరిపోతోంది. ప్రజాసమస్యలను ఎలా హైలైట్ చేయాలి అనే విషయాన్ని మాత్రం ఈ రెండు రోజుల ఈనాడు పత్రిక చాటి చెప్పింది. సాటి మీడియా వాళ్ళందరికీ కూడా బోలెడన్ని పాఠాలు నేర్పించింది. మీడియాకు పాలకులు భయపడే రోజులు పోయాయి అంటారు కానీ మీడియావాళ్ళకే సత్తా తగ్గిపోయింది, సొంత ప్రయోజనాల కోసం కాంప్రమైజ్ అయిపోతున్నారు, కక్కుర్తిపడిపోతున్నారు అనే విషయాలను మాత్రం చాలా మంది ఒప్పుకోరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రెండు రోజుల ఈనాడు పత్రికను చదవాలి. ఇంకో వారం రోజుల పాటు ఈనాడులో ఇదే స్థాయి లోతైన విశ్లేషణాత్మక వార్తలు వస్తే మాత్రం చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికీ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. పాలకుల తప్పులను ప్రస్తావించకుండా ఈనాడువారు జాగ్రత్తపడుతున్నారు కానీ ….ప్రస్తుతం ఉన్న భయకంరమైన కరువు పాలకుల పాపమే అనే విషయాన్ని కూడా హైలైట్ చేస్తే మాత్రం టిడిపి నాయకులందరూ కూడా బెంబేలెత్తిపోవడం ఖాయం. అదీ ఈనాడు జర్నలిజం స్థాయి. దాదాపుగా మూడేళ్ళుగా ప్రతి పక్ష స్థానాన్ని పోషిస్తున్నాం అని చెప్పుకుంటున్న సాక్షి మీడియా నుంచి ఈ స్థాయి విశ్లేషణ ఆశించగలమా? జగన్‌ని పొగుడుతూ, చంద్రబాబుని తిడుతూ రాసే వార్తల్లో మాత్రం తమ టాలెంట్ మొత్తం చూపిస్తుంటారు సాక్షివారు. మరి అదే ప్రజా సమస్యలను హైలైట్ చేసే విషయంలో మాత్రం ఈనాడు దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈనాడు ఇచ్చిన ప్రేరణతో అయినా ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతుకులు ఈడుస్తున్న పల్లె ప్రజల బ్రతుకు చిత్రాన్ని సాక్షివారు కూడా ప్రజలకు, పాలకులకు తెలిసేలా ఏమైనా చేస్తారేమో చూడాలి. గ్రామ సీమల దయనీయ స్థితిని సిటీవాసులు కూడా చర్చించుకునేలా చేసింది ఈనాడు. ఆ వార్తలో వచ్చిన ప్రతి అక్షరం నిజం. అంత అద్భుతంగా పల్లె బ్రతుకులను ప్రజెంట్ చేసిన ఈనాడువారిని ఎంత అభినందించినా తక్కువే. అన్ని విషయాల్లోనూ ఈనాడుతో పోటీపడతాం అని చెప్పుకునే సాక్షివారు ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈనాడుతో పోటీ పడతారేమో చూడాలి. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకూ ఈనాడు వారు కూడా కాడి విడిచిపెట్టకూడదని కోరుకుందాం.