ఎపి నుంచి రాజ్యసభకు తెలుగుదేశం తరపున లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణను పంపాలని ప్రతిపాదన వచ్చినట్టు మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. ఇది నిజమేనా అన్న సందేహం కూడా తెలుగుదేశం వారే వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజనతో అసలే అవకాశాలు తగ్గిపోయిన స్థితిలో అత్యంత విధేయులైన వారికే అవకాశాలు కల్పించలేని స్థితి వుందని చెబుతున్న అధినేత బయిటివారికి స్థానమిచ్చి ఎలా సమర్థించుకుంటారనేది వారి ప్రశ్న. ఇప్పటి వరకూ అధికారికంగా చెప్పకపోయినా ఈ కథనాలపై ఆయన నుంచి స్పష్టత కోరాలని మంచిది కాదని చెప్పాలని కూడా అనుకుంటున్నట్టు కొందరు నేతలు వెల్లడించారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని విచారిస్తే లోక్‌సత్తా వర్గాలతో పాటు కొందరు తెలుగుదేశం నేతలు కూడా ఉప్పందించినట్టు సమాచారం. ఈ ఆఫర్‌పై జెపి ఇంకా నిర్ధారణకు రాలేదని మరో కథనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్నుంచి ఈ సూచన వచ్చింది గనక చంద్రబాబు కాదనలేరని కూడా అనుకూల వర్గాల వాదనగా వుంది. అయితే యుపిఎ హయాంలో సోనియా గాందీ సలహా బృందంలో వుండి ి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సన్నిహితంగా మెలిగిన జెపి మోడీ వచ్చాక బిజెపిలోనూ ఏదో ఒక పదవి సంపాదించడానికి చాలా ప్రయత్నాలు చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హౌదా వంటి విషయాలపై కూడా జెపి వాదనలు స్థిరంగా లేవని ఇలాటి వారిలో ఒక నాయకుడు సోదాహరణంగా వివరించారు. గతంలో నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు వంటి వారికి రాజ్యసభ ఇస్తేనే ఉపయోగం లేనప్పుడు జెపిలాటి వ్యక్తికి ఎందుకు అవకాశమివ్వాలో తాము గట్టిగా ప్రశ్నిస్తామని పైగా దానివల్ల నష్టమని కూడా అన్నారు. ఈ కాలంలో కొందరు నాయకుల దగ్గర రాజ్యసభ విషయమై కదిలించిన చంద్రబాబు తుది నిర్ణయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఆఖరి నిముషంలోగాని దాన్ని బయిటపెట్టరని గతానుభవం. ఈ లోగా ఎవరి ఆశను బట్టి వారు కథనాలు విడుదల చేయిస్తుంటారు. అందులో జెపిది ఒకటి అనుకోవాలి. ఒకసారి టిడిపి సీటు తీసుకుంటే మాత్రం ఆయన తటస్థ పాత్ర ముగిసిపోయినట్టే అవుతుంది. పైగా ఎన్నికల పోటీకి దూరంగా వుంటానని ప్రకటించిన జెపి తానే దాన్ని ఎలా ఉల్లంఘిస్తారని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.