శ్రీరెడ్డి అనే నటీమణి లేవనెత్తిన ఇష్యూ…టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అటూ ఇటు తిరిగి విషయం పవన్ కల్యాణ్ దగ్గరకు రావడం.. పవన్ కల్యాణ్ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని… పోరాటం ప్రారంభించడంతో.. ఇండస్ట్రీ అంతా ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితుల్లో పడింది. ఇరవయ్యో తేదీన ఫిల్మ్ చాంబర్ లో మెగా ఫ్యామిలీ బలప్రదర్శన చేయడం.. ఆర్జీవీతో పాటు కొన్ని మీడియా చానళ్లపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేయడంతో దానిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇరవై ఒకటో తేదీన అన్నపూర్ణ స్టూడియోలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన సంఘాలతో సమావేశం నిర్వహించారు. అయితే అక్కడ ఏకాఫిప్రాయం రాలేదు. మీడియాను బ్యాన్ చేస్తే.. చిత్ర పరిశ్రమకే సమస్యలొస్తాయని… మెజార్టీ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో.. శ్రీరెడ్డి లేవనెత్తిన అంశాలు.. ఆడవాళ్లపై వేధింపులను అపడానికి ఓ హైపవర్ కమిటీని నియమించారు. అయినా ఈ ఇష్యూ ఇంతటితో ఆగలేదు. పవన్ కల్యాణ్ మీడియా సంస్థలను టార్గెట్ చేసి ట్వీట్లు పెడుతూనే ఉండటంతో… మెగాస్టార్ చిరంజీవి కల్పించుకున్నారు. ఇండస్ట్రీలోని టాప్ 20 హీరోలతో అన్నపూర్ణ స్టూడియోలో సమావేశం పెట్టారు.
అత్యంత రహస్యంగా చిరంజీవి ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసినా… చివరిలో అందరికీ తెలిసింది. మీటింగ్ ఎజెండా.. గా చిరంజీవి అందరు హీరోల ముందు ఒక్కటే ఉంచారు. చిత్ర పరిశ్రమను కించ పరుస్తున్న మీడియాకు తమ సినిమా కంటెంట్ ఇవ్వకూడనేదే ఆ ఎజెండా. దానికి కొంత మంది హీరోల నుంచి మద్దతు లభించింది. కానీ అప్ కమింగ్ హీరోలు మాత్రం కొంచెం తటపటాయించినట్లు సమాచారం. మీడియా అండ లేకపోతే… ప్రజల దృష్టిలో పడటం కష్టమనేది వారి భావన. ఈ సమావేశంలో తుది నిర్ణయమేమీ తీసుకోలేదు. కానీ మీడియా మాత్రం ఇండస్ట్రీని టార్గెట్ చేయకుండా చేయాలన్న ఏకాభిప్రాయం వచ్చింది.
ప్రతి రంగంలోనూ..లోపాలు ఉంటూనే ఉంటాయి. అంత మాత్రాన దాన్ని నిషేధించేస్తామనడం కన్నా… చేతకాని తనం ఇంకేమీ ఉండదనేది బయట వ్యక్తమవుతున్న అభిప్రాయం. అలా అంటే ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం ఉందని.. కొంత మంది పట్టుబడ్డారని.. అలాంటప్పుడు ఇండస్ట్రీని బ్యాన్ చేయమంటామా అని కొందరు సినీ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. మీడియాకు కంటెంట్ ఇవ్వకూడదనుకోవడం.. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకోవడమేనని చాలా మంది అబిప్రాయం.