మాజీ సిఎస్రమాకాంతరెడ్డి ని జగన్ కేసుపై సాక్షి ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేయడం ఆయన కేసు నిలబడదని చెబితే అమితంగా ప్రచారంలో పెట్టడం సరిగ్గా లేవని గతంలోనే రాశాను. తర్వాత సిబిఐ ఆ కారణంగా బెయిలు రద్దు చేయాలని వేసిన కేసులో తుది తీర్పును సిబిఐ కోర్టు 28వ తేదీన ప్రకటించనుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం వర్గాలు, కొన్ని మీడియా సంస్థలు జగన్ బెయిలు రద్దయిపోవడం ఖాయమైనట్టు కథనాలు ఇవ్వడం ఆశ్చర్యకరం. తీర్పు ఎలా వుంటుందనేది న్యాయమూర్తి ఇష్టమైనప్పటికీ దానిపై మరో కోర్టుకువెళ్లే అవకాశం వుంటుంది. అది కూడా బెయిలు రద్దు చేస్తే. అలాటి సంకేతాలే వుంటే కోర్టు ఇంత యథాలాపంగా సమయం తీసుకునేది కాదని చెప్పొచ్చు. ఈ ఫిర్యాదులో ఇంటర్వ్యూ చేసింది గాని వ్యాఖ్యలు చేసింది గాని తాను కాదు గనక దాన్ని బట్టి తన బెయిలు రద్దు చేయడం జరక్కపోవచ్చు. సాక్షి జగన్‌దే అన్న మాట జగమెరిగిన సత్యమైనా సాంకేతికంగా తనకు దానితో సంబంధం లేదని ఆయన వాదిస్తున్నారు. ఆయనదే అనుకున్నా మరెవరో చేసిన ఇంటర్వ్యూకు బాధ్యత కోర్టు తనపై మోపుతుందని అనుకోలేము. కేసులు రాజకీయ కక్షతో వేశారని ఆరోపించడం వేరు. సిబిఐపై వ్యాఖ్యలు చేయడం వేరు. శాసనసభలో జగన్ చాలాసార్లు ఈ కేసులు మీరు కాంగ్రెస్ కలిసి పెట్టారని తెలుగుదేశం నేతలను విమర్శిస్తూనే వున్నారు. దేవుడు న్యాయం చేస్తాడని కూడా కేసుల్లో వున్నవారు అంటుంటారు. అవన్నీ ప్రభావితం చేసే అంశాలుగా భావించేట్టయితే ఎప్పుడో బెయిలు రద్దయి వుండాలి. కాని చట్టం అలా వుండదు. కాకపోతే ఈ ఇంటర్వ్యూను బట్టి కోర్టు జగన్‌పై విమర్శనా వ్యాఖ్యలు చేయొచ్చు. జాగ్రత్తగా వుండాలని హెచ్చరించవచ్చు. అదే క్రమంలో సాక్షిలో వచ్చేవాట్ికి ఆయన బాధ్యత లేదని గనక చెప్పకపోవచ్చు.
సిబిఐ హఠాత్తుగా ఈ కేసు వేయడం కేంద్రం దాగుడుమూతల్లో భాగం అనుకోవాలి. బిజెపి తమ మిత్రపక్షమైనా జగన్ కేసులో మెతగ్గా వుందని టిడిపి ఫిర్యాదు చేస్తుంటుంది. అందుకు అవకాశం లేకుండా చేయడంతో పాటు వైసీపీని కూడా దారిలో పెట్టుకోవాలన్న ఆలోచన దీని వెనక వుందనుకోవాలి. నిజంగా బెయిలు రద్దయినా వైసీపీపైనా జగన్‌పైనా ఆయన మద్దతుదారుల పైనా పెద్ద ప్రభావం వుండదు. ఎందుకంటే ఆ కేసుల మధ్యలోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఒక శక్తిగా పెరిగారు గనక. బహుశా ఇప్పటికిప్పుడు దానికి వచ్చిన ముప్పేమీ వుండదు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వైఎస్ భారతి నాయకత్వం స్తీకరిస్తారని కథనం ప్రసారం చేయడం ఆ పార్టీ నాయకత్వానికే మేలు చేయొచ్చు.ఎందుకంటే అనుకోని తీర్పు వస్తే ఎదర్కొవడానికి రంగం సిద్ధం చేసినట్టవుతుంది! అయితే ఈ తీర్పు తర్వాత తప్పక సాక్షి గాని, జగన్ అత్యుత్సాహ అభిమానులు గాని జాగ్రత్త పడకతప్పదు.