రీమేక్ వెనుక చాలా కష్టాలుంటాయి. కథైతే ఆలోచించాల్సిన పనిలేదు గానీ, కనిపించని సమస్యలు చాలానే వెంటాడుతుంటాయి. ముఖ్యంగా మన నేటివిటీకి సరిపడిందా, లేదా? అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. దానికి తోడు… పాత్రధారుల్ని ఎంపిక చేయడం మరో పెద్ద కష్టం. కొన్ని సినిమాలకు కొన్ని పాత్రలు జీవం పోస్తాయి. అలాంటి నటుల్ని రీప్లేస్ చేయడం ఎల్లవేళలా సాధ్యం కాదు. `అంధధూన్` రీమేక్ కి ఇలాంటి కష్టమే ఎదురవుతోంది.
ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటించిన ఈ హిందీ చిత్రం.. అక్కడ సూపర్ హిట్ అయ్యింది. హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం కూడా లభించింది. ఈ సినిమాని ఇప్పుడు నితిన్ రీమేక్ చేస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానాని నితిన్ భర్తీ చేయగలడు. కానీ సమస్య.. టబు పాత్రతోనే. ఇందులో టబు ఓ కీలకమైన పాత్ర పోషించింది. ఓ రకంగా తనే ఈ సినిమా విలన్. టబు లాంటి నటి, నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర పోషించడం వల్ల ఈ సినిమాకి అదనపు హంగు ఏర్పడింది. ఇప్పుడు తెలుగులో ఆ పాత్రని చేసే కథానాయికని వెదికిపట్టుకునే పనిలో ఉంది చిత్రబృందం. అయితే టబుని రీప్లేస్ చేసే హీరోయిన్ దొరకడం లేదు. జ్యోతిక పేరు పరిశీలనలోకి వచ్చినా, తాను ఈ పాత్ర ఒప్పుకోదు. ఓ మాజీ హీరోయిన్, పైగా సెక్సపీల్ ఉన్న కథానాయిక అయితే బాగుంటుంది. కేథరిన్, అమలాపాల్ లాంటి వాళ్లని ఆ పాత్ర కోసం పరిశీలిస్తున్నారు. ఎవర్ని తీసుకున్నా.. టబు తో పోల్చి చూస్తే దొరికిపోతారు. పోనీ టబునే తీసుకుంటే పోలా..? ఆమె ఒప్పుకుంటే ఈ కష్టం నుంచి గట్టెక్కినట్టే. కాకపోతే ఆమె పారితోషికమే భరించడం కష్టం. పైగా ఓసారి చేసిన పాత్రని మరోసారి చేయడానికి టబు ఇష్ట పడుదు కూడా. సో.. ప్రత్యామ్నాయం వెదుక్కోవడం తప్పదు.