ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని ఇప్పుడు పెడుతున్న ఒకే ఒక్క అంశం… విదేశాల నుంచి ఏపీలోకి వచ్చిన వాళ్లు ఎంత మంది..? వాళ్లెవరు అనేదే. కరోనా వైరస్‌ను ఇండియాలోకి తీసుకొచ్చింది.. విదేశీ ప్రయాణాల నుంచి వచ్చినవారే. ముందుగా వారిని ఐసోలేషన్‌కు పంపితే.. చాలా వరకూ.. కరోనా వ్యాప్తి ఆగిపోతుందని.. కేంద్రం అంచనాకు వచ్చి.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ అలర్ట్ తొందరగా చేసిందా.. మేలుకున్న తర్వాత చేసిందా అన్న సంగతి పక్కన పెడితే.. ఆ అలర్ట్ వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు.. తమ రాష్ట్రంలోకి విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు ఎంత మందో కనిపెట్టలే్కపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా.. అంతే. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ గందరగోళం ఇంకా ఎక్కువ ఉంది.
విదేశాల నుంచి వచ్చిన వారి లెక్కల్లో గందరోళం.. !
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాలు పేరుకు ఉన్నాయి కానీ..అంతర్జాతీయ విమాన సర్వీసులు ఒకటో ..రెండో తప్ప లేవు. కాబట్టి.. నేరుగా విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తక్కువ. కానీ పోర్టులు ఉన్నాయి. హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై ఎయిర్ పోర్టుల నుంచి దిగేవారిలో.. గణనీయ సంఖ్యలో ఆంధ్రులున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు.. అక్కడి ఎయిర్‌పోర్టుల్లో ధర్మల్ స్క్రీనింగ్ చేయించేసుకుని ఏపీలోకి ఎంటరయ్యారు. ఇక్కడ వీళ్ల రికార్డులు లేవు. ఎప్పుడు వచ్చారో.. ఏ దేశం నుంచి వచ్చారో కూడా తెలియదు. కేంద్రం నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఒక్కొక్కర్ని ట్రేస్ చేయడం ప్రారంభించారు. కానీ ఈ సంఖ్య ఎంతో అధికారవర్గాలకే తెలియదు. ప్రభుత్వం.. మొదట్లో తొమ్మిది వేలు అని ప్రారంభించింది.. ఇప్పటికి ఆ సంఖ్య 29వేలు అని చెబుతోంది. అందర్నీ హోం క్వారంటైన్లో ఉంచామని చెబుతోంది.
పదే పదే రిమైండర్లు పంపుతున్న కేంద్ర హోంశాఖ..!
అయితే.. 29వేల మందిని హోం క్వారంటైన్ లో ఉంచామని ఏపీ సర్కార్ చెబుతున్నా.. కేంద్రానికి నమ్మకం కలగడం లేదు. హోం క్వారంటైన్ లో ఉన్న వారిని.. ఏపీకి విదేశాల నుంచి వచ్చిన వారికి తేడా కనిపిస్తోందని.. అంటోంది. ప్రత్యేకంగా లేఖలు రాసి హెచ్చరికలు జారీ చేస్తోంది. నిజానికి ఇలా కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు.. విదేశాల నుంచి వచ్చిన వారందరి అడ్రస్సులు పట్టుకుని వాలంటీర్లు.. గ్రామ సచివాలయ ఉద్యోగులు.. పోలీసులు.. అందరూ తిరిగారు. ఇలా తిరిగినా.. ఆచూకీ దొరకని వాళ్లు వేలల్లోనే ఉన్నారు. వారు ఆయా చిరునామాల్లో ఉండటం లేదని అంటున్నారు. అందుకే.. ప్రభుత్వ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.
మూడు సార్లు వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసినా ఎందుకీ పరిస్థితి..?
యాభై ఇంటిలో వాలంటీర్ ఉన్నాడని.. వారిని ఇంటింటికి పంపి .. అన్ని వివరాలు తెలుసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. ఇప్పటికి మూడు సార్లు ఇంటింటి సర్వే చేసినట్లుగా కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇంత వరకూ.. విదేశాల నుంచి ఎంత మంది వచ్చారు.. ఎక్కడ ఉంటున్నారన్న క్లారిటీ మాత్రం రాలేదు. వీరంతా.. జన సమూహాల్లో తిరిగి ఎక్కడ కరోనా వైరస్‌ను సామాజికంగా వ్యాప్తి చేస్తున్నారోనన్న భయం.. అందర్నీ వెంటాడుతోంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి .