తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి దిగ్విజయ్ సింగ్ ను తప్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్ ను తప్పిస్తున్నట్టు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. డిగ్గీరాజా స్థానంలో ఇన్నాళ్లూ ఆయనకు సహాయకుడిగా ఉంటున్న కుంతియాకు బాధ్యతలు అప్పగించారు. ఇకపై, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా కుంతియా వ్యవహరించబోతున్నట్టు పార్టీ ప్రకటించింది. అయితే, ఇదేమీ అనూహ్యమైన నిర్ణయం కాదు. ఎందుకంటే, డిగ్గీరాజాపై ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలోనే చాలా విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గడచిన మూడేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు డిగ్గీరాజా చేసిన కృషి ఏమంత చెప్పకోదగ్గదిగా లేదనే నివేదికలు కూడా సోనియా గాంధీకి చేరాయనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ బాధ్యతల్ని దిగ్విజయ్ చూస్తున్నా, ఆయన రాష్ట్రానికి తరచూ వస్తున్నదీ లేదు. పార్టీలో సమస్యలపై పెద్దగా స్పందిస్తున్నదీ లేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని, అప్పుడప్పుడూ టీట్లు చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మాత్రమే ఆయన వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు. తాజాగా డ్రగ్స్ కేసు అంశాన్నే తీసుకుంటే… మంత్రి కేటీఆర్ సన్నిహితులకు భాగస్వామ్యం ఉందేమో, వారిని విచారించరా అంటూ ట్వీట్ చేసి వివాదానికి తెర తీశారు. దీనిపై అధికార పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దిగ్విజయ్ కు మతి భ్రమించిందనీ, ఆయన విశ్రాంతి తీసుకుంటేనే మంచిదంటూ కేటీఆస్ కూడా ధీటుగా స్పందించారు. ఆ మధ్య తెలంగాణ పోలీసులపై కూడా ఇలానే ఒక వివాదాస్పద కామెంట్ చేశారు. నకిలీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ముస్లిం యువకులను ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాద సంస్థల్లోకి వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతేకాదు, ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై ఓ కేసు కూడా నమోదైంది.
ఇవేవీ పార్టీకి పనికొచ్చే పనులు కావు. ఇలాంటి వివాదాలను రాజేయడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్తగా కలిసొచ్చేదేం లేదు. దిగ్విజయ్ ను బాధ్యతల నుంచి తప్పించడం వెనక ఇదీ ఓ కారణంగా చెప్పుకోవచ్చు. రెండోది… తెలంగాణ కాంగ్రెస్ లో ఒక వర్గానికి దిగ్విజయ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గీయులంటే డిగ్గీరాజాకు గిట్టడం లేదనీ, వారితో వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నారంటన్న ఆరోపణలు సోనియా గాంధీ వరకూ చేరినట్టు ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఏవిధంగా చూసుకున్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆయన వల్ల జరుగుతున్న మేలు లేదని సోనియా గాంధీ భావించారనీ, అందుకే ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించారనే వాదన వినిపిస్తోంది. ఈ నిర్ణయం దిగ్విజయ్ కు షాక్ అయి ఉండొచ్చేమోగానీ… తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ముందుగా ఊహించినదే జరిగిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య ధోరణికి స్వస్తి పలికి, రాబోయే ఎన్నికలకు సర్వసన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఉందనీ, ఇదే క్రమంలో టీపీసీసీ పదవిలో కూడా మార్పు ఉండొచ్చని కొంతమంది సీనియర్లు అంటున్నారు.