ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్ని .. వ్యవస్థల్ని ఎలా మభ్య పెడుతుందో..పథకాలు..లబ్దిదారులను బట్టి చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు .. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోవడం లేదని వస్తున్న విమర్శలకు కూడా అదే విధంగా కౌంటర్ ఇస్తోంది.ఈ అంశంపై కోర్టు కేసులు పడ్డాయి. కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్రం నుంచి డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలన్న సూచనలు వచ్చాయి. చివరికి ఇప్పుడు డిజిటల్ పెమెంట్స్ తీసుకోబోతున్నామని ప్రచారం చేశారు.. శుక్రవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు స్వయంగా ప్రకటించారు.
తీరా చూస్తే.. ఎన్ని దుకాణాల్లో ప్రారంభించారంటే.. పదకొండు అంటే పదకొండు. మొత్తం ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. జిల్లాకు ఒక్క దుకాణంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను పెట్టలేదు. మొత్తం ఉన్న దుకాణాలు 3708. కానీ అమల్లోకి తెచ్చింది 11. దీనికి మళ్లీ డిజిటల్ వ్యవస్ధ అందుబాటులోకి అని గొప్ప ప్రచారం. ఎస్బీఐ సహకారంతో మద్యం విక్రయాల్లో ఆన్ లైన్ చెల్లింపు తీసుకొచ్చింది ఎక్సైజ్ శాఖ.. ఇక, డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు నిబంధనల ప్రకారం ఛార్జీల వసూలుకు నిర్ణయం తీసుకున్నారు.
మద్యం విషయంలో తయారీ దారుల దగ్గర్నుంచి అమ్మకం వరకూ మొత్తం వైసీపీ నేతల చేతుల్లో ఉండటం.. నగదు లావాదేవీలు జరుగుతూండటంతో అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఆరోపణలు ఎన్ని వచ్చినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. చిన్న చిన్న దుకాణాల్లోనూ డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు. కానీ మద్యం దుకాణాల్లో మాత్రం ఆ వ్యవస్థ అందుబాటులో లేదు. ఇప్పుడు తెస్తున్నామని ప్రచారం చేసి.. అందుబాటులోకి తెచ్చింది కేవలం 11 దుకాణాల్లోనే. కానీ ప్రచారం మాత్రం ఘనంగా చేసుకుంటున్నారు. అంటే డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నమన్న ఆరోపణలు ఈ కారణంగానే వస్తాయి.