నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆ ఓటమికి బాధ్యత స్వీకరిస్తూ యదా ప్రకారం ఆత్మవిమర్శ చేసుకొని తప్పులు సరిదిద్దుకొంటామని చెప్పారు. దానిపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఊహించని విధంగా చాలా ఘాటుగా స్పందించారు.
“ఎన్నికలలో గెలుపోటములు సాధారణమే. కనుక ఈ ఎన్నికలలో ఓటమి అనూహ్యమైనదేమీ కాదు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆత్మవిమర్శ కాదు సర్జరీ అవసరం. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తరువాత ఆత్మపరిశీలన చేసుకొని లోపాలు సవరించుకొంటామని అనుకొన్నాము కానీ ఇంతవరకు కూడా పార్టీలో అటువంటిదేమీ జరుగలేదు. పార్టీని సమూల ప్రక్షాళన చేయకుండా ఇంకా ఎంత కాలం ఆత్మపరిశీలన పేరిట కాలక్షేపం చేస్తాము? కనుక కాంగ్రెస్ పార్టీలో తక్షణమే సమూల ప్రక్షాళన చేసుకొని పార్టీని కాపాడుకోవలసిన ఆవసారం చాలా ఉంది,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ఆత్మపరిశీలన, లోపాలు సరిదిద్దు కోవడం, పార్టీ సమూల ప్రక్షాళన చేయడం వంటి మాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రతీ ఎన్నికలలో ఓడిపోవడం ఇప్పుడు ఎంత సాధారణ విషయం అయిపోయిందో, ఆ పార్టీలో ఈ మాటలు వినపడటం కూడా అంతే సాధారణం అయిపోయింది. అలాగే వాటితో బాటు రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి, నాయకత్వ మార్పు గురించి కూడా కొన్ని రోజులు ఆ పార్టీలో నేతలే మాట్లాడటం కూడా ఆనవాయితీగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతోందనుకోక తప్పదు.