తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ప్రజలకు నిన్న ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కూడా ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. పనిలోపనిగా అదే చేత్తో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ట్విట్టర్ లో విమర్శలు కూడా గుప్పించారు.
“కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసి మీడియాలో ప్రచార ప్రకటనలు ఇచ్చుకొంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలు చనిపోతుంటే సంబరాలు జరుపుకొంటున్నారు. కేసీఆర్ మరో నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. అందుకు సిగ్గుపడాలి కేసీఆర్!” అని ట్విట్టర్ మెసేజ్ పెట్టారు.
కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగ మాట్లాడుతుంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కనుక దిగ్విజయ్ సింగ్ ఈవిధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, మోడీ ప్రభుత్వం మీడియాలో ప్రచార ప్రకటనలు వేసుకొంటున్నట్లుగానే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వేసుకొనేది. అప్పుడూ దేశ వ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి మారిన తరువాత రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తూ వారి కుటుంబాలని పరామర్శించడమే అందుకు నిరదర్శనం. అలాగని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియాలో ప్రచార ప్రకటనలు ఇవ్వకుండా ఆగిపోలేదు. అప్పుడు దానిని ప్రతిపక్షాలు నిందించేవి. ఇప్పుడు అది అధికారంలో ఉన్న పార్టీలని నిందిస్తోంది. అన్ని పార్టీలు కూడా ఆ తానులో ముక్కలే. ప్రజాధనానికి ధర్మకర్తలుగా మెలగవలసిన ప్రభుత్వాలు, విచ్చలివిడిగా ఖర్చుపెట్టుకొంటున్నాయి. మళ్ళీ అధికార ప్రతిపక్షాలు స్థానాలు మారగానే వాటిని అవే తప్పు పట్టుకొంటాయి. అయినా వాటి తీరు ఎన్నటికీ మారదు.