హైదరాబాద్: యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశితరూర్ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాకూబ్‌ను ఉరితీయటంలో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ అవసరానికి మించి వేగం, అంకితభావం చూపాయని, కుల,మత,ప్రాంతాలకు అతీతంగా తీవ్రవాద కేసులన్నింటిలో ఇలాంటి అంకితభావాన్నే చూపాలని ట్వీట్ చేశారు. తీవ్రవాదానికి సంబంధించిన ఇతర కేసుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తనకు సందేహాలు ఉన్నాయని, ప్రభుత్వ, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా ఉందని పేర్కొన్నారు. కలామ్, యాకూబ్ అంత్యక్రియలు ఒక్కరోజే జరగటాన్ని పోలుస్తూ మరో ట్వీట్ చేశారు. ఇద్దరు ముస్లిమ్‌ల అంత్యక్రియలు ఒక్కరోజే జరిగాయని, ఒకరు దేశానికి గర్వకారణమైతే, మరొకరు అపకీర్తి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.
మరోవైపు తిరువనంతపురం ఎంపీ శశి తరూర్ యాకూబ్ మెమన్ను ఉరి తీయడాన్ని వ్యతిరేకించారు. అంతేకాక దేశంలో మరణశిక్ష అమలునుకూడా తప్పుబట్టారు. ఉరిశిక్ష అమలు చేయటంవల్ల తీవ్రవాదదాడులు ఆగవని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఒక మనిషిని ఉరితీయటం తనకు బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే ఇలాంటి హత్యలవలన మనమందరమూ హంతకులుగా మారిపోతున్నామని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ మండిపడింది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ప్రజలను అవమానించేవిధంగా ఉన్నాయంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. అటు కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాలని, వాటిని పార్టీ అభిప్రాయాలుగా పరిగణించగూడదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ చెప్పారు.