కొన్ని దశాబ్ధాల లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా బిజెపికి పూర్తి స్థాయి మెజారిటీ కట్టబెట్టడానికి ప్రధాన కారణం…. కాంగ్రెస్ పార్టీని ఘోరాతి ఘోరంగా పాతి పెట్టేయాలన్న భారతీయుల కోపమే. కానీ కాంగ్రెస్ వారికి మాత్రం ఆ ట్రీట్మెంట్ సరిపోయినట్టుగా లేదు. అధికారంలో ఉన్న పదేళ్ళలో చోటుచేసుకున్న స్కాములు, అమ్మవారి రాజవైభోగం, సామాన్య ప్రజల బ్రతుకు కష్టాలు.. లాంటి విషయాలను పక్కన పెడితే కాంగ్రెస్ వారు చేసిన మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
అయినప్పటికీ తెలుగు ప్రజల మధ్య కుమ్ములాటల కాష్టం రగిలిపోవడానికి దిగ్విజయంగా తన వంతు పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఇంకా తెలివి వచ్చినట్టులేదు. పోలీసుల కాల్పుల్లో టెర్రరిస్టులు చనిపోయారు. అది ఎన్‌కౌంటరా? కాదా? అని మీడియాలో బోలెడన్ని చర్చలు నడుస్తున్నాయి. రాజకీయాలంటే ప్రజా సేవ చేయడం అన్న అర్థాన్ని మార్చేసి… మీడియా గొట్టాల ముందు ఏదో ఒకటి మాట్లాడేయడం అని అనుకుంటూ ఉండే నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి వాగేస్తున్నారు. అందుకే శ్రీ దిగ్విజయ్ సింగ్ వారు కూడా తాను అనుకుంటున్న రాజకీయం చేయడానికి అర్జెంట్‌గా మీడియా గొట్టాల ముందుకు వచ్చేశారు. కాంగ్రెస్ నాయకులకు బాగా అలవాటైన మైనారిటీ కార్డును బయటకు తీశారు. జైలులో అంతమంది ఖైదీలు ఉండగా కేవలం ముస్లిం ఖైదీలు మాత్రమే ఎందుకు పరారయ్యారని గొప్పలాజిక్ తీశారు శ్రీ దిగ్విజయ్గోరు. కాంగ్రెస్ వారి మైనారిటీ రాజకీయాల గురించి కొత్తగా చెప్పడానికి ఏముందిలే కానీ…. కాకపోతే పారిపోయిన టెర్రరిస్టులూ అందరూ ముస్లిములే అన్న అర్థం కూడా శ్రీ దిగ్విజయ్వారి మాటల్లో గట్టిగా వినిపిస్తోంది. ఐఎస్ఐ తీవ్రవాదంతో సహా అన్ని సంస్థల తీవ్రవాదులనూ చాలా మంది ముస్లిములే అసహ్యించుకుంటున్నారు. తీవ్రవాదులు ముస్లిములు అన్న మాటలు వినడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు శ్రీ దిగ్విజయ్గారు పారిపోయిన తీవ్రవాదులు ముస్లిములే అన్న అర్థం వచ్చేలా మాట్లాడుతున్న మాటలను ముస్లిముల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న కోణంలో వాళ్ళు తీసుకుంటే మాత్రం అసలుకే మోసం రావడం ఖాయం.