ఏపి కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గురువారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్ర విభజన కారణంగా పూర్తిగా దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని ఆయన సమీక్షిస్తారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి దానిని సిద్దం చేసేందుకు రాష్ట్ర నేతలకి ఆయన మార్గదర్శనం చేస్తారు.
అయితే ఏపిలోనే కాదు తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నటికైనా అధికారంలోకి రాగలదా? అసలు వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉంటుందా? అని కాంగ్రెస్ నేతలే అనుమానిస్తూ వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నప్పుడు, వచ్చే ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీని సిద్దం చేయడం అంటే చాలా కష్టమైన పనే.
దిగ్విజయ్ సింగ్ గొప్పదనం ఏమిటంటే, ఆయనకి ఏ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి శాస్వితంగా తాళాలు వేసేస్తుంటారు. ఆయన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా చేసి ఆ రాష్ట్రంలో తన పార్టీ మళ్ళీ ఎన్నడూ కోలుకోలేని విధంగా చేసి చేతులు దులుపుకొన్నారు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్ లో భాజపాయే అధికారంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బాధ్యతని కాంగ్రెస్ అధిష్టానం మొదట గులాం నబీ ఆజాద్ కి అప్పగిస్తే, దాని వలన చాలా సమస్యలు వస్తాయని గ్రహించిన ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తూంటే, అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆ బాధ్యతని దిగ్విజయ్ సింగ్ అప్పగించింది. ఆయన కేవలం ఆరు నెలలలోనే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ యధాప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకి తాళాలు వేసేశారు. కనుక మళ్ళీ వాటిని తెరిచే బాధ్యత కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకే అప్పగించింది.
రెండు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులని గమనిస్తే అది అసాధ్యమని అర్ధమవుతుంది. ఏపిలో తెదేపా, వైకాపాలు చాలా బలంగా ఉన్నాయి. తెదేపాతో భాజపా కలిసే ఉంటుందో లేదో తెలియకపోయినా, కాంగ్రెస్ తో పోలిస్తే దాని పరిస్థితే చాలా మెరుగుగా ఉందని చెప్పవచ్చు. ఒకవేళ రాష్ట్ర ప్రజలు తెదేపా, భాజపాలని వద్దనుకొంటే వైకాపాకే అధికారం కట్టబెడతారు తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదు. ఆ సంగతి కాంగ్రెస్ పార్టీ కూడా గ్రహించింది కనుకనే వైకాపాతో జత కట్టాలని ప్రయత్నిస్తోంది కానీ జగన్ అసలు పట్టించుకోవడం లేదు. అయినా కాంగ్రెస్ తో వైకాపా జత కట్టడం వలన కాంగ్రెస్ పార్టీయే లాభపడవచ్చేమో గానీ వైకాపాకి ఏమి ప్రయోజనం ఉండదు. పైగా వైకాపాకి అదొక గుది బండగా మారుతుంది. ప్రజాధారణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీతో వైకాపా జత కట్టడం అంటే తన కాళ్ళని తానే నరుకొన్నట్లవుటుంది కనుకనే జగన్ కాంగ్రెస్ ఇస్తున్న సంకేతాలని పట్టించుకోవడంలేదని చెప్పవచ్చు.
ఇక రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం పట్ల ప్రజలలో కొంత వ్యతిరేకత కనబడుతున్నప్పటికీ, అది చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలంటే వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలు మళ్ళీ దానికే ఓటు వేసి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంది. తెదేపా కూడా తన అధికారం నిలబెట్టుకోవడానికి ఇంకా గట్టిగా ప్రయత్నించవచ్చు. కనుక తెదేపా, వైకాపాలని కాదని రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి బలమైన కారణాలు, అవకాశాలు రెండూ కనిపించడం లేదు. కనుక దిగ్విజయ్ సింగ్ ఎంతగా ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయానికి తను వేసిన తాళం తెరవడం కష్టమేనని చెప్పక తప్పదు. అది తెరుచుకోవడానికి మరో 10 ఏళ్ళు పట్టవచ్చు కనుక 2024 సం.లో జరిగే ఎన్నికల గురించి ఆలోచించడం మంచిదేమో!