ఏ సినిమాకైనా హై మూమెంట్స్ నాలుగో అయిదో ఉంటాయి. ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా తీసుకోండి.. అయిదారు ఎసిపోడ్స్ క్లిక్ అయితే చాలు అనుకుంటారు. కొంతమంది ఇంట్రవెల్ బ్యాంగ్పై నమ్మకం పెట్టుకుంటారు. ఇంకొంతమంది క్లైమాక్స్ పై ఆధారపడిపోతుంటారు. ‘మహర్షి’ ప్రాణం అంతా ఆ క్లైమాక్స్ దగ్గరే ఉంది. అందుకే పతాక సన్నివేశాలపై గంపెడు ఆశలు పెట్టుకుంది చిత్రబృందం. ఈ సినిమా కోసం ఎమోషనల్ క్లైమాక్స్ డిజైన్ చేశాడు వంశీ పైడిపల్లి. అది చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు ఆగవట. ఈ విషయాన్ని దిల్రాజునే చెప్పాడు.
దాంతో పాటు అల్లరి నరేష్ పాత్రపైనా చాలా హోప్స్ ఉన్నాయి. ఈ పాత్ర ఏ మేరకు పండుతుంది? ఏ స్థాయిలో ప్రేక్షకుల హృదయాల్లో నాటుకుపోతుంది అనేదాన్ని బట్టి మహర్షి సినిమా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని తెలుస్తోంది. ఆ పాత్రని ముందు నుంచీ హైడ్ చేస్తూనే వస్తోంది చిత్రబృందం. స్క్రీన్ పై ఆ పాత్ర చూసి షాక్ అవ్వాలన్నది వాళ్ల ఉద్దేశం. నరేష్ పాత్రకు యాంటీ క్లైమాక్స్ డిజైన్ చేశారని, కథానాయకుడి పాత్రలో మార్పు అక్కడి నుంచే మొదలవుతుందని, ఆ పాత్ర… ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మహర్షి బలం.. నరేష్, క్లైమాక్స్ సీన్ అని తేలిపోయింది. మరి ఇవి రెండూ ఈ సినిమాని ఏ మేరకు గట్టెక్కిస్తాయో చూడాలి.