11న రావాల్సిన వారసుడు వెనక్కి వెళ్లింది. ఈ సినిమాని 14న విడుదల చేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. ఏపీ, తెలంగాణలలో… చిరంజీవి, బాలకృష్ఱ చిత్రాలకు ఎక్కువ థియేటర్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పుకొచ్చారు దిల్ రాజు. అయితే తమిళంలో మాత్రం ఈనెల 11నే వారసుడు వస్తోంది. రెండు రోజులు ఆలస్యంగా తెలుగులో విడుదల అయినంత మాత్రాన.. తన సినిమాకొచ్చే నష్టం ఏమీ లేదని, సినిమాపై నమ్మకంతోనే… ఆలస్యమైనా చూస్తారన్న ధీమాతోనే వాయిదా వేశామని క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. రిలీజ్ డేట్ మార్పు విషయంలో ఇండస్ట్రీలోని పెద్దలందరితోనూ చర్చించానని, వాళ్లు తన నిర్ణయాన్ని హర్షించారని చెప్పుకొచ్చారు.
ఈనెల 12న వీర సింహారెడ్డి, 13న.. వాల్తేరు వీరయ్య విడుదల అవుతున్నాయి. వీటి మధ్య వారసుడు వస్తోంది. రెండు తెలుగు సినిమాలు ఉండగా, ఓ డబ్బింగ్ సినిమాకి థియేటర్లు ఎందుకు ఇవ్వాలి? అంటూ మిగిలిన నిర్మాతలూ, డిస్టిబ్యూటర్లూ దిల్ రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. జనవరి 11న తన సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు దిల్ రాజు. కానీ ఇప్పుడు మళ్లీ విడుదల తేదీలో మార్పు వచ్చింది.