దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ జాస్తి. ఈ సీజన్లో తన బ్యానర్ నుంచి ఒక్క సినిమా అయినా ఉండేలా ప్లాన్ చేసుకొంటారు. 2024లో ‘ఫ్యామిలీస్టార్’ని రంగంలోకి దింపాలనుకొన్నారు. కానీ కుదర్లేదు. షూటింగ్ ఆలస్యం అవ్వడం, సంక్రాంతి సీజన్లో మహేష్ బాబు సినిమా బరిలో ఉండడం, ఆ సినిమాని దిల్ రాజు పంపిణీ చేయడం.. తదితర కారణాల వల్ల ‘ఫ్యామిలీస్టార్`ని రిలీజ్ చేయలేదు. దాంతో వేసవికి సినిమా షిఫ్ట్ అయ్యింది. వేసవిలో కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే దిల్రాజు ఎడ్జస్ట్ అయ్యారు. కానీ దిల్ రాజు అంచనాల్ని ‘ఫ్యామిలీ స్టార్’ అందుకోవడంలో దారుణంగా విఫలం అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ‘లైగర్’ ఫ్లాప్ అయినా ప్రారంభ వసూళ్లు అదిరాయి. కానీ… ‘ఫ్యామిలీస్టార్’కి ఆ అడ్వాంటేజ్ కూడా దొరకలేదు.
వేసవి సీజన్, దానికి తోడు పరీక్షలు అయిపోయాయి, బాక్సాఫీసు దగ్గర పెద్దగా సినిమాలేం లేవు.. కాబట్టి తనకు కలిసొస్తుందని భావించారు. ఫలితం శూన్యం. దాంతో దిల్ రాజు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డార్ట. `ఏదోలా సంక్రాంతికి విడుదల చేసినా.. వసూళ్లు దక్కేవి` అని ఫీల్ అవుతున్నార్ట. సంక్రాంతి సీజన్లో కాస్త అటూ ఇటుగా టాక్ వచ్చినా, ఫ్యామిలీ సినిమాలు నడిచేస్తాయి. ‘నా సామిరంగ’ కేవలం సంక్రాంతి సీజన్లో విడుదలైన కారణంతోనే సేఫ్ అయ్యింది. ఆ అడ్వాంటేజ్… ‘ఫ్యామిలీ స్టార్’కీ దక్కేది. ఏపీలో ఎన్నికల వేడి రాజుకోవడం, సినిమాలపై మూడ్ తగ్గడం, ఐపీఎల్ .. ఇవన్నీ కలిసి ‘ఫ్యామిలీ స్టార్`కు కలక్షన్లు రాకుండా చేశాయి.