సినిమా మోడల్ మారిపోతోంది. మేకింగ్ పై దర్శకులు దృష్టి పెడుతున్నారు. విజవల్ గా ఎంత గొప్ప సినిమా తీస్తున్నాం? అనే దానిపై ఫోకస్ పెడుతున్నారు. దాంతో బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ ఉంది కదా అనే ధైర్యం ఒక వైపు, ఓటీటీలు ఆదుకొంటాయన్న అనే భరోసా మరోవైపు నిర్మాతల్ని నడిపిస్తున్నాయి. ఓ మంచి సినిమా తీయాలంటే చాలా త్యాగాలు చేయాలి. ముఖ్యంగా హీరోలు, దర్శకులు పారితోషికాలు తగ్గించుకోవాలి. కనీసం సినిమా మొదలయ్యేటప్పుడు కాకున్నా, పూర్తయ్యాక లాభాల్లో వాటాల్లా అందుకొంటే నిర్మాతలకు వెసులుబాటు ఉంటుంది.
మలయాళంలో ‘లూసీఫర్ 2’ తెరకెక్కింది. మోహన్ లాల్, ఫృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. ట్రైలర్ చూస్తే మతి పోతోంది. మలయాళంలో ఇంత కాస్ట్లీ సినిమా రాలేదేమో అనిపిస్తోంది. ఈ సినిమా కోసం మోహన్ లాల్, ఫృద్వీరాజ్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యాక, బాగా ఆడితే, లాభాల్లో వాటా అందుకొంటారు. సినిమాపై వాళ్లకు అంత నమ్మకం. దాంతో పాటు ఇప్పుడు ఖర్చు పెట్టే ప్రతీ పైసా సినిమా క్వాలిటీ కోసమే అనేది వాళ్లు నమ్మిన థియరీ.
ఇది నిజంగా మన దర్శకులు, హీరోలు ఆచరించాల్సిన ఫార్ములా. ఇప్పటికే కొంతమంది హీరోలు ఇదే బాటలో నడుస్తున్నారు. ‘పుష్ప 2’ కోసం బన్నీ కానీ, సుకుమార్ కానీ పారితోషికాలు తీసుకోలేదు. లాభాల్లో వాటా అందుకొన్నారు. అది వాళ్లకు ప్లస్ అయ్యింది. రాజమౌళి స్కూల్ కూడా ఇదే. ఆయన తన ప్రతీ సినిమాకూ లాభాల్లో వాటానే అందుకొంటారు. మహేష్ సినిమా కోసం కూడా అదే చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ తన పద్ధతులు మార్చుకొన్నాడని, పారితోషికం బదులుగా వాటా తీసుకొంటున్నాడని టాక్.
రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్… వీళ్లంతా పెద్ద పెద్ద సినిమాలు తీసే మేకర్స్. క్వాలిటీ విషయంలో రాజీ పడరు. వీళ్లు దాదాపుగా వాటాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. వీళ్లతో పని చేసే హీరోలకూ అది తప్పడం లేదు. మిగిలిన హీరోలు, దర్శకులు కూడా ఇదే బాటలో నడిస్తే నిర్మాతలకు కాస్త వెసులుబాటు దొరుకుతుంది.