‘రాజకీయం స్నేహితుడిని ద్రోహిగా చేసింది. అభిమానిని హంతకుడిగా మార్చింది’ దిల్ రాజు నిర్మాణంలో నిన్న రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమాలోని డైలాగ్ ఇది. నిజమే రాజకీయం మహాచెడ్డది. రెండువైపులా పదునున్న ఆ కత్తి ఎటైనా తిరగగలదు. ఇప్పుడు స్వయంగా నిర్మాత దిల్ రాజు ఇది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నిజామాబాద్ లో జరిగిన తన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన కొన్ని మాటలకు ప్రత్యర్ధులు రాజకీయ రంగు పులిమేశారు. దీంతో దిల్ రాజు క్షమాపణ చెప్పాల్సివచ్చింది.
‘మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్మీడియాలో పెట్టారని తెలిసింది. తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది అని చెప్పటం నా ఉద్దేశం. అది అర్థం చేసుకోకుండా సోషల్మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల మనస్తాపం చెందితే క్షమించండి. నిజంగా నా ఉద్దేశం అది కాదు’ అని వివరణ ఇచ్చారు దిల్ రాజు.
నిజానికి ఆ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన వాఖ్యలకు అక్కడ లోకల్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జనం కేరింతలు కొట్టారు. కానీ దిల్ రాజు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఓ పదవిలో వున్నారు. దీంతో ఆయన వాఖ్యాలకు రాజకీయ రంగుపులిమారు కొందరు. మటన్, కల్లు అని దిల్ రాజు మాట్లాడటం తెలంగాణ ప్రజలని అవహేళన చేసినట్లుగా వుందనే కోణంలో ప్రాజెక్ట్ చేశారు.
నిజానికి ఇవే వాఖ్యలు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో చేశారు. ఎబీఎన్ రాధకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కల్లు తాగడం మా కల్చర్. మా ఇళ్ళల్లో ఆడవాళ్ళూ కూడా కాస్త పుచ్చుకుంటారు’ అని ఆన్ రికార్డ్ కేసీఆర్ చెప్పడం అందరికీ తెలుసు. అప్పుడు కేసిఆర్ అంటే కల్చర్ గా కనిపించింది. దిల్ రాజు అంటే మాత్రం ఎదో అవమానించినట్లు రాద్ధాంతం చేయడం రాజకీయం తప్పితే మరొకటి కాదు.