ప్రముఖ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెలవప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారన్నది ప్రశ్నను కొంత మంది తీసుకు వస్తున్నారు. టాలీవుడ్ నుంచి కాంగ్రెస్ కు సపోర్టు చేసిన వారు లేరు. ఎన్నికల సమయంలో ఎక్కువ మంది సైలెంట్ గా బీఆర్ఎస్నే సమర్థించారు. నటుల్లో.. నిర్మాతల్లో బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతుపలికిన వారు లేరు.
అందుకే టీఎఫ్డీసీ పదవిని సినీరంగంలో ఎవరికి ఇస్తారన్నదానిపై ఆసక్తి వ్యక్తమయింది. అయితే కాంగ్రెస్ నేతల్లో కొంతమందికి సినీ రంగంతో సంబంధం ఉంది. వారిలో పదవుల కోసం చూస్తున్న వారు ఉన్నారు. వారికి ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. హీరో నితిన్ కుటుంబం కాంగ్రెస్ కు చెందినదే. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డితో పాటు ఆయన బంధువులు కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. కానీ వర్కవుట్ కాలేదు. టీఎఫ్డీసీ పదవికి నితిన్ తండ్రి కరెక్ట్ అన్న వాదన కూడా ఉంది.
దిల్ రాజు కాంగ్రెస్ కోసం ఎప్పుడూ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేదని ..కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. దిల్ రాజు పార్టీకి ఆర్థికంగా ఏమైనా ఉపయోగపడతారో లేదో కానీ ఆయన మాత్రం తన సినిమాలకు సంబంధించిన పనులను మాత్రం ప్రబుత్వం ఇచ్చిన పదవితో చక్కబెట్టుకుంటారన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.