నేను చెడుతప్ప ఏదీ చూడను – ఓ హీరో క్యారెక్టరైజేషన్‌కి క్యాప్షన్!
నేను చెడుతప్ప ఏదీ మాట్లాడను – మరో హీరో క్యారెక్టరైజేషన్‌కి క్యాప్షన్!
నేను చెడుతప్ప ఏదీ వినను – ఇంకో హీరో క్యారెక్టరైజేషన్‌కి క్యాప్షన్!
నేను చెడుతప్ప ఏదీ చేయను – ఇంకొక హీరో క్యారెక్టరైజేషన్‌కి క్యాప్షన్!
ఇటువంటి నాలుగు క్యారెక్టరైజేషన్లు కల కుర్రాళ్ళ కథతో తెరకెక్కుతోన్న సినిమా ‘హుషారు’. సెలబ్రేషన్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్… అనేది సినిమా క్యాప్షన్. ఇందులో పాటను విడుదల చేయడానికి దిల్రాజును ఛీఫ్ గెస్ట్‌గా పిలిచారు. వేదిక మీదకు రాగానే ఆయన హీరోల క్యారెక్టరైజేషన్లకు ఇచ్చిన క్యాప్షన్ల మీద సెటైర్ వేశారు. ‘‘నేను ఏమో సినిమాల్లో మంచి చెబుదామని ప్రయత్నిస్తున్నా. వీళ్ళేమో చెడును చూపించాలని సినిమా తీసి, ఇందులో పాటను విడుదల చేయడానికి నన్ను పిలిచారు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఆ తరవాత ‘‘ఈ రోజుల్లో ప్రేక్షకులు మంచీ చెడూ ఆలోచించడం లేదు. మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నారు. లిప్‌లాక్స్ వుండాలని అంటున్నారు. ఇటువంటి సినిమాలను వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళే రైట్ ఏమో!! భవిష్యత్తులో వీళ్ళ దారిలోకి నేను రావాల్సి వస్తుందేమో’’ అని దిల్‌రాజు అన్నారు. కుటుంబ వ్యవస్థ, పెళ్ళి విలువ గురించి చెబుతూ దిల్‌రాజు నిర్మించిన ‘శ్రీనివాస కల్యాణం’ ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. లిప్‌లాక్స్, బోల్డ్ సీన్లు ఉన్న ‘ఆర్ఎక్స్ 100’ విజయం సాధించింది. బహుశా… వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ మాటలు అన్నారేమో!!
ఇక, ‘హుషారు’ సినిమా విషయానికి వస్తే… ‘సినిమా చూపిస్త మావ’, ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ సినిమాల తర్వాత బెక్కం వేణుగోపాల్ నిర్మించిన సినిమా ఇది. సోమవారం సినిమాలో తొలిపాటను విడుదల చేశారు. ‘అందాల రాక్షసి’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాల ఫేమ్ రధన్ ‘హుషారు’కు సంగీతం అందించారు.