నిర్మాత దిల్ రాజు ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని సినిమాల్లో వాడుకునేలా ఓ సంస్థతో చేతులు కలిపారు. ఖచ్చితంగా మారుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఇదొక ముందు అడుగనే చెప్పాలి. ఎఐ అన్ని రంగాల్లోకి వచ్చేసింది. ఇండియాలో కంటే ఫారిన్ సినిమాల్లో ఏఐ వాడకం పెరిగింది. స్క్రిప్ట్ ని డెవలప్ చేయడంలో చాలా టూల్స్ అందుబాటులో వున్నాయి. దిల్ రాజు ప్రయత్నం కూడా ఇదే. స్క్రిప్ట్ రైటింగ్, కథ తాలూక ప్రీ విజువైలేషన్, అలాగే ఎడిటింగ్ లో కొన్ని టూల్స్ ని అభివృద్ధి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
సరిగ్గా వాడుకోవాలే కానీ ఎఐ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో దీని పరిధి ఎక్కువ. ఒక ఐడియాని డెవలప్ చేయడానికి గతంలో పది మంది రైటర్స్ కూర్చుని పది ఆలోచనలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు అందుబాటులో వున్న టూల్స్ లో ఐడియాని వేస్తె అదే పది రకాలు ఆలోచనలని డెవలప్ చేయగలదు. అయితే సరైన ప్రామ్ట్ ఇవ్వడం ఇక్కడ కీలకం.
ఫారిన్ రైటర్స్ చాలా మంది ఎఐ టూల్స్ ని వాడుకునే కథలు జనరేట్ చేస్తున్నారు. ఇలా ఎఐని వాడుకొని కథలు సృష్టించడం మంచి ట్రెండ్ కాదనే వాదనలు కూడా వున్నాయి. ఏది ఏమైనప్పటికీ మారుతున్న ట్రెండ్ కి తగట్టుగా వెళ్ళడం మంచిదే. దిల్ రాజు ప్రయత్నం కూడా ఇదే కావచ్చు. అయితే ఎఐ డెవలప్మెంట్ నిరంతర ప్రక్రియ. దాన్ని కొనసాగించాలంటే టెక్ కంపనీ స్థాయిలో వర్క్ చేయాల్సి వుంటుంది. మరి దిల్ రాజు పూర్తి స్థాయి ప్రణాళికలు ఎలా ఉంటాయో మే 4న తెలుస్తుంది. ఆ రోజు దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించనున్నారాయన.