నో డౌట్.. విజయ్ దేవరకొండ కొండ ఇప్పుడో స్టార్. తన దశ కూడా అలానే ఉంది. పట్టిందల్లా బంగారమే. ఓ చిన్నపాటి విజయం దక్కితేనే చాలు.. చిత్రపరిశ్రమ ‘శూరుడు ధీరుడు’ అని కీర్తిస్తుంది. అలాంటిది అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి విజయాలు చూశాక ఊరకే ఉంటుందా?? ఆ పొగడ్తలు, కితాబులు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ విషయంలోనూ అదే జరుగుతోంది. ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్ లో ఇదే అక్షరాలా కనిపించింది. ఈ వేడుకలో వక్తలంతా విజయ్‌ని పొగడ్తలతో ముంచేయడమే పనిగా పెట్టుకున్నారు. దానికి విజయ్ అర్హుడు కూడా. కొంతమంది విజయ్‌ని పవన్ కల్యాణ్‌తో పోలిస్తే, ఇంకొంతమంది చిరంజీవితో పోలికలు పెట్టారు.
విజయ్నిచూస్తుంటే తొలి ప్రేమ సమయంలో యూత్‌ని మెస్మరైజ్ చేసిన పవన్ కల్యాణ్ గుర్తొస్తున్నాడని కితాబు ఇచ్చారు దిల్‌రాజు. అర్జున్ రెడ్డి విజయం ఏదో గాలివాటం అనుకున్నానని, కానీ `గీత గోవిందం`తో పరిశ్రమలోనివాళ్లందరినీ షాక్‌కి గురి చేశాడని చెప్పుకొచ్చారాయన. అల్లు అరవింద్ దీ ఇదే మాట. ఆయనా దిల్రాజులానే పవన్‌తో పోల్చారు. చిరంజీవిలోని లక్షణాలు కూడా విజయ్‌లో ఉన్నాయని పోలికలు తీసుకొచ్చారు. చిరంజీవి కూడా అంతే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల పక్కన విజయ్‌కీ స్థానముందని, తనో వర్సటైల్ యాక్టర్ అని పొడిడేశారు. ఇక నుంచి అడుగులు మరింత ఆచి తూచి వేయాలని సలహా కూడా ఇచ్చారు. అభిమానుల్ని గుండెల్లో పెట్టుకోమని సూచించారు. నిజానికి ఒకట్రెండు సినిమాలో ఇలా స్టార్ డమ్ తెచ్చేసుకున్న కథానాయకుడెవరూ లేరు ఈమధ్యన. ఈ ఇమేజ్‌నీ, ఈ క్రేజ్‌నీ విజయ్ ఎలా కాపాడుకుంటాడన్నది ఆసక్తికరమే.