ఓ నిర్మాతకు డేట్ లు ఇవ్వమని మరో నిర్మాత కోరడం అన్నది ఇండస్ట్రీలో చాలా అరుదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది టాలీవుడ్ లో. టెంపర్ సినిమా టైమ్ లో హీరో ఎన్టీఆర్ తో, కథకుడు వంశీతో, ఫైనాన్షియర్ సచిన్ జోషి తో వివాదాలు రావడంతో భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కొన్నాళ్ల పాటు సినిమా నిర్మాణానికి దూరం అయ్యారు.
అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలు తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అది అంత సులువుగా సాధ్యం కావడం లేదు. హీరో నాని డేట్ ల కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు బోగట్టా. ఇందుకోసం ఏస్ డిస్ట్రిబ్యూర్, నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. ఆయన హీరో నానికి నచ్చ చెప్పి, డేట్ లు ఇప్పించే పనిలో పడ్డారు.
బండ్లకు డేట్ లు ఇవ్వమని, తనదీ హామీ అని నిర్మాత దిల్ రాజు, ఫైనాన్షియర్ సత్యరంగయ్య నానికి నచ్చ చెబుతున్నట్లు బోగట్టా. కానీ నాని ఇంకా ముందు వెనుకలు ఆడుతున్నారట. తన దగ్గరకు సరైన కథ వచ్చి ప్రాజెక్టు సెట్ అయితే ఇస్తానని తాత్కాలికంగా మాట అయితే ఇచ్చినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది.
అయితే అసలు బండ్లకు డేట్ లు ఇప్పించడం వెనుక దిల్ రాజు ఆలోచన ఏమిటన్నది తెలియడం లేదు.
అదే ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్ గా వుంది. దిల్ రాజు ఎందుకు ఇంత గట్టి ప్రయత్నం చేస్తున్నారు? ఆయన కు వచ్చే లాభం ఏమిటి అని గుసగుసలు పోతున్నారు. కేవలం వైజాగ్, నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం అయితే ఇంత చేయక్కరలేదు. ఏ సినిమా అయినా దిల్ రాజును దాటి ఎక్కడికీ పోదు. అంతకు మించి ఏముందో బండ్లకు-దిల్ రాజకే తెలియాలి.