శ్రీనివాస కల్యాణం, విశ్వరూపం 2… ఈవారం రాబోతున్న ఈ రెండు సినిమాల్లో… `శ్రీనివాస కల్యాణం`కే బజ్ ఎక్కువగా ఉంది. ఈ సినిమా పై ముందు నుంచీ పాజిటీవ్ టాకే నడుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి, దానికి తోడు దిల్ రాజు అనే బ్రాండ్ ఉంది కాబట్టి – ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగుండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లో ప్రొఫైల్లో విడుదల కావాల్సిన సినిమా ఇది. ఈ తరహా ఫ్యామిలీ జోనర్లకు లో ప్రొఫెల్ అవసరం కూడా. `శతమానం భవతి` చూశాం కదా? ఎలాంటి హడావుడి లేకుండా ఆ సినిమా విడుదలైంది. బడా హీరోల చిత్రాలతో పోటీ పడి సంక్రాంతి బరిలో నిలబడగలిగింది. `శ్రీనివాస కల్యాణం`నీ అలానే విడుదల చేద్దామన్నది దిల్రాజు వ్యూహం. కానీ ఏమైందో ఏమో… గేరు మార్చేశాడు రాజు. ఆదివారం బయ్యర్ల కోసం ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. వాళ్లు ‘ఆహా.. ఓహో..’ అనే సరికి దిల్ రాజు ఉత్సాహం రెట్టింపు అయ్యింది. దాంతో ‘మా బ్యానర్లోనే నెంబర్ వన్ సినిమా అవుతుంది’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దిల్రాజు సంస్థ నుంచి వచ్చిన చిత్రాల్లో హిట్లు, సూపర్ హిట్లు, చరిత్ర సృష్టించిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటితో.. విడుదలకు ముందే ఈ సినిమాని పోల్చడం నిజంగా సాహసమే. దానికి తోడు నితిన్ కూడా ‘నా కెరీర్లో ఇదే బెస్ట్ ఫిల్మ్’ అంటూ స్టేట్మెంట్ విసిరాడు. రాశీఖన్నా కూడా ఇలానే అంటోంది. ఈ సినిమాలో నటించినవాళ్లు, సాంకేతిక సహాయం అందించిన వాళ్లు అంతా ‘ఇదే బెస్ట్ ఫిల్మ్’ అంటుంటే… కచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకూ ఈ సినిమాపై జనాలకు ఎలాంటి అంచనాలూ లేవు. ‘ఫ్యామిలీ సినిమా కాబట్టి. బాగుండే ఛాన్సుంది’ అనుకున్నారు. ఈ మాటలతో… అవన్నీ ఆకాశానికి చేరాయి. ఎలాంటి అంచనాలూ లేకుండా థియేటర్లకు రావల్సిన వాళ్లు ‘దిల్రాజు, నితిన్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్’ అనుకుంటూ థియేటర్లలోకి అడుగుపెడితే ప్రమాదమే. ఈ విషయం దిల్రాజు లాంటి మేకర్లు గ్రహించాలి. ప్రోమోలు, పాటలు చూస్తే కచ్చితంగా ఇది మంచి సినిమా అయ్యే ఛాన్సుంది. కానీ.. దిల్రాజు మాటలు బుర్ర ఎక్కించుకుంటే.. ఇది మంచి సినిమా అయితే సరిపోదు. గొప్ప సినిమా కావాలి. మరి ఆ స్టఫ్ `శ్రీనివాస కల్యాణం`లో ఉందా?? ఈ ప్రశ్నకు సమాధానం బాక్సాఫీసే చెప్పాలి.