ఈ సంక్రాంతి దిల్ రాజుకు మిశ్రమ ఫలితాల్ని అందించింది. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయితే, సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ గా నిలిచింది. ఆయన పంపిణీ చేసిన `డాకూ మహారాజ్`కు మంచి వసూళ్లు దక్కాయి. అయితే ఎన్ని హిట్లు కొట్టినా ‘గేమ్ చేంజర్’ నష్టం ఇప్పట్లో పూడ్చడం కష్టం. నిజానికి దిల్ రాజుది మాస్టర్ మైండ్. సినిమా ఫలితం ఎలా వచ్చినా, ముందే సేఫ్ జోన్లో ఉండేలా చూసుకొంటారు. 50 సినిమాలు తీసిన అనుభవం. బడ్జెట్ ని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. కానీ `గేమ్ చేంజర్` విషయంలో ఆ అనుభవం ఎందుకూ అక్కరకు రాలేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన వేస్టేజీని ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. సినిమా బడ్జెట్ లో 25 శాతం వేస్టేజీ ఖాతాలోకి వెళ్లిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది భారీ మొత్తమే.
శంకర్ తో ఓ పేచీ ఉంది. ఆయన తన సినిమా విషయంలో నిర్మాతల్ని జోక్యం చేసుకోనివ్వరు. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిందే. దానికి ఒప్పుకొన్న నిర్మాతలే శంకర్ తో పని చేయగలరు. కాకపోతే ఇటీవల నిర్మాతలు కొంత రాటు దేలారు. లైకా ప్రొడక్షన్ ‘భారతీయుడు 2’ సినిమా మొదలెట్టే ముందే శంకర్ తో ఓ ఎగ్రిమెంట్ చేయించుకొంది. బడ్జెట్ దాటినా, వేస్టేజీ ఉన్నా, అనుకొన్న సమయానికి సినిమా విడుదల చేయకపోయినా, ఆ నష్టాన్ని శంకర్ భరించాల్సిందే. ఆ ఎగ్రిమెంట్ ప్రకారమే ‘భారతీయుడు 2’ తీశారు. ఆ గొడవలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి ఎగ్రిమెంట్ ఏదీ.. దిల్ రాజు శంకర్ తో చేయించలేకపోయాడు. ఒకవేళ ఈ ఎగ్రిమెంట్ జరిగి ఉంటే, శంకర్ నుంచి నష్టపరిహారాన్ని దిల్ రాజు ముక్కు పిండి మరీ వసూలు చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు.
సాధారణంగా ఓ సినిమాకు నష్టాలొస్తే – అదే దర్శకుడు మరో సినిమాను తక్కువ పారితోషికానికి చేసి, నిర్మాతల్ని ఆదుకొనే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ `గేమ్ చేంజర్` నష్టాల్ని భర్తీ చేసుకోవడానికి శంకర్ తో మరో సినిమా చేసేంత రిస్క్ దిల్ రాజు తీసుకోలేడు. అందుకే శంకర్ని ఈ విషయంలో దిల్ రాజు ఇబ్బంది పెట్టడం లేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఏ నిర్మాతకైనా 50 వ సినిమా ఓ మైలు రాయిగా మిగిలిపోవాలని ఉంటుంది. దిల్ రాజు కూడా అలానే ప్లాన్ చేసి ఈ సినిమా తీశారు. కానీ మైలురాయి కాస్తా.. బండరాయిగా మారింది. అంతే తేడా.