దిల్‌రాజు నిర్మాతే కాదు.. మేకర్ కూడా. ఏ సినిమాని ఎవరితో తీయాలో, ఏ కథని ఎవరి చేతుల్లో పెట్టాలో, ఎప్పుడు ఎలాంటి జోనర్‌ని నమ్ముకోవాలో బాగా తెలుసు. నిర్మాతగా పంపిణీదారుడిగా ఆయన అనుభవం వెలకట్టేలేనిది. అయితే…. కొత్త దర్శకులతో సినిమా తీస్తున్నప్పుడు దిల్‌రాజు చాలా కఠినంగా ఉంటారని, ఓ విధంగా ఆయనే తెర వెనుక దర్శకుడిగా మారిపోతారని చెబుతుంటారు. ‘శ్రీనివాస కల్యాణం’ విషయంలోనూ ఇదే జరిగిందని, అన్ని విషయాల్లోనూ వేలు పెట్టి సతీష్‌ని తెగ విసిగించాడని వార్తలొచ్చాయి. ఇవి దిల్‌రాజు వరకూ చేరాయి. దాంతో ఆయనకు కోపం వచ్చింది. ‘ఆ వార్తల్ని చూసి నేను హర్ట్ అయ్యాను. నేను దర్శకుల వెనుక మాత్రమే ఉంటాను. మేమంతా కార్మికులం. కలసి పనిచేస్తాం. ఓ కథ విన్న తరవాత దర్శకుడితో నేను కూడా ప్రయాణం చేస్తాను. ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. దయ చేసి ఇలాంటి వార్తలు రాయొద్దు” అన్నారాయన. నితిన్, రాశీఖన్నా నటించిన శ్రీనివాస కల్యాణం.. ఈవారమే విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లను కూడా కొత్తగా, టైటిల్‌కీ, కథకీ తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నారు. కొత్తగా పెళ్లయిన వధూవరులు తమ పెళ్లి శుభలేఖ పంపితే.. శ్రీనివాస కల్యాణంకి సంబంధించిన పట్టువస్త్రాలు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు.