దిల్ రాజుకి లక్కీ హ్యాండ్. ఆయన కమర్షియాలిటీకి కేరాఫ్ అడ్రస్స్. ఓ ప్రాజెక్టు చేపడితే – దాదాపుగా హిట్ చేసేస్తుంటాడు. అందుకే దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే హిట్టవుతుందని ఫిక్సయిపోవొచ్చు. కమర్షియల్ సినిమాలు తీసినా ఎప్పుడూ `హద్దు` దాటలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎప్పుడూ దూరం చేసుకోలేదు. పెద్ద హీరోలతో సినిమాలు చేసినా, అదే పంథా.
మహేష్ బాబు లాంటి హీరో దొరికినప్పుడు పక్కా మాస్ మసాలా సినిమా సెట్ చేసేయొచ్చు. అలాంటి సినిమా చేస్తే ఇంకా ఎక్కువ లాభాలొస్తాయి కూడా. కానీ.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `మహర్షి` లాంటి కథల్ని ఎంచుకున్నాడు. నిర్మాతగా దిల్ రాజు ఈ సినిమాలతో లాభాల్ని గడించాడు. ప్రేక్షకుల మన్ననల్నీ అందుకున్నాడు. ఇప్పుడు జాతీయ ఉత్తమ చిత్రాల జాబితాలో `మహర్షి`కి చోటు దక్కింది. దాంతో పుణ్యం – పురుషార్థం రెండూ లభించినట్టైంది. ఉత్తమ నిర్మాణ సంస్థ అనే మరో క్యాటగిరీలో… శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కి అవార్డు దక్కడం తో దిల్ రాజు మరింత హ్యాపీ. ఎందుకంటే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు ఇరవై ఏళ్లయ్యింది. త్వరలో 50 వసినిమా మైలు రాయిని చేరువ అవుతున్న ఈ శుభ సందర్భంలో దిల్ రాజు సినిమాకి జాతీయ స్థాయిలో పురస్కారం దక్కడం, నిర్మాతగా తనకు ఓ గౌరవం లభించడంతో ఆయన మరింత ఖుషీ అవుతున్నారు.