దిల్ రాజుని ఓ విషయంలో మెచ్చుకొని తీరాలి. టాలెంట్ ఉంటే చాలు, హిట్టు దక్కినా, లేకపోయినా.. ఆయా దర్శకుల్ని పెంచి పోషిస్తూనేఉంటాడు. దిల్రాజు కాంపౌండ్లో అడుగుపెట్టిన దర్శకులంతా అక్కడ పాతుకుపోవడానికి అదే కారణం. హరీష్ శంకర్ కూడా పూర్తిగా దిల్రాజు కాంపౌండ్ మనిషి అయిపోయాడు. ఎన్టీఆర్ తో తీసిన రామయ్యా వస్తావయ్యా భారీ నష్టాలు మిగిల్చింది. అయినా సరే – దిల్రాజు మళ్లీ పిలిచి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అవకాశం ఇచ్చాడు. అదీ యావరేజ్ సినిమానే. అయితే.. వెంటనే దిల్రాజు ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ చేశాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీతో సినిమా పట్టాలెక్కించాడు. అదే డీజే. ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రమోషన్లు చేశారు, రివ్యూలు ఏకి పరేసినా ‘మా సినిమా హిట్టే, కావాలంటే వసూళ్లు చూడండి..’ అంటూ వారించారు.
అయితే.. చివరాఖరికి డీజే కూడా నష్టాలు మిగిల్చింది. అంత మాత్రాన దిల్రాజు ఏం హరీష్ శంకర్ని వదిలేయలేదు. వెంటనే మరో సినిమా కి ఛాన్స్ ఇచ్చాడు. దిల్రాజు కాంపౌండ్లో హరీష్ శంకర్ వరుసగా నాలుగో సినిమా టేకప్ చేస్తున్నాడు. ఈ సినిమాకి దాగుడు మూతలు అనే టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. తన సంస్థకు వరుసగా ఫ్లాపులు ఇస్తున్నా.. అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్న దిల్రాజు.. హరీష్ శంకర్ పాలిట దేవుడు కాకపోతే మరేంటి?? చూద్దాం… ఈసారైనా హరీష్ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకొంటాడో, లేదో?