డబుల్ హ్యాట్రిక్… దిల్ రాజుని ఊరిస్తోంది. ఈ నెల 21న విడుదల కాబోతున్న ఎంసీఏ హిట్టయితే… దిల్ రాజు డబుల్ కొట్టినట్టే. అయితే కొంతమంది సినీ విశ్లేషకులు, ట్రేడ్ వర్గాలు మాత్రం… దిల్ రాజుని డబుల్ హ్యాట్రిక్ ఎలా అవుతుంది? అని ప్రశ్నిస్తున్నారు. డీజేతో పంపిణీదారులకు నష్టాలొచ్చాయని, రాజా ది గ్రేట్ దీ అదే పరిస్థితి అని లెక్కలు తీస్తున్నారు. ఇంతకాలం ‘డీజే’ హిట్టే అని చెబుతూ వచ్చిన దిల్రాజు తొలిసారి… `డీజే`తో నష్టాలొచ్చిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నాడు.
”డీజే ఫ్లాప్ అని కొంతమంది రాస్తున్నారు. కానీ.. మా సంస్థకు అత్యధిక లాభాల్ని తెచ్చిన సినిమా అది. అక్కడక్కడ పంపిణీదారులు కొంత మొత్తం నష్టపోయిన మాట వాస్తవం. కానీ దాన్ని ‘ఫిదా’ సినిమాతో భర్తీ చేశాం. ఏ సినిమాకి ఎంత వస్తుందన్నది నాకు ముందే తెలుస్తుంది. కానీ.. ఆయా సినిమాల్ని పంపిణీదారులకు ఇస్తుంటాను. దానికి కారణం ఒక్కటే.. నేనూ స్వతహాగా పంపిణీదారుడినే. వాళ్లతో నా సంబంధాలు, అనుబంధం కొనసాగాలన్న ఉద్దేశంతో ప్రతీ సినిమానీ బయటకు ఇస్తుంటాను. రాజా ది గ్రేట్ కూడా మంచి లాభాలనే తీసుకొచ్చింది. డబ్బులు పోవడం, రావడం అనేది ఒక సినిమాతో ముడి పడి ఉండదు.. దాని ముందు సినిమా, తరవాత సినిమా కూడా ప్రభావం చూపిస్తుంటుంది” అంటున్నాడు దిల్రాజు. పోనీలెండి.. మొత్తానికి ఇలాగైనా – డీజే వల్ల నష్టాలొచ్చాయి అని ఒప్పుకున్నాడు.