ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని దిల్ రాజు చొరవ తీసుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి అపాయింట్మంట్ కోరామని.. ఇవ్వగానే వెళ్లి కలుస్తామని చెబుతున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమా వేడుకలో కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత విడిగా ప్రెస్మీట్ పెట్టారు. సినిమా వేడుకలో మాట్లాడినప్పుడు నాని తప్పుగా ఏమీ మాట్లాడలేదని.. తప్పుగా అర్థం చేసుకున్నారని వెనకేసుకువచ్చారు. తర్వాత విడిగా ప్రెస్మీట్ పెట్టినప్పుడు మరింత సంయమనంతో వ్యవహరించారు. ఏపీ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు సరిగా తీసుకు వెళ్లలేదని తాము భావిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే మరో సారి కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచుకునే విధంగా జీవో వచ్చినట్టు, త్వరలో ఏపీలోనూ జీవో వస్తుందని ఆశిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడవద్దని ఆయన కోరారు.పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చలు జరపడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ కి ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుందని ‘దిల్’ రాజు, ‘స్రవంతి’ రవికిశోర్ తదితరులు తెలిపారు.
ఛాంబర్ కొంత మంది పేర్లు ఇచ్చిందని, త్వరలో కమిటీ వివరాలను ప్రభుత్వమే వెల్లడిస్తుందని ఆయన తెలిపారు. కమిటీ ఉంటే చర్చలు జరపడానికి సులభతరం అవుతుందని ఆయన అన్నారు. ఏపీ మంత్రి పేర్ని నానితో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశానికి, కమిటీకి సంబంధం లేదన్నారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తుందని, పాత రోజులు వచ్చి అద్భుతంగా ఉంటుందని ‘దిల్’ రాజు ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే దిల్ రాజు సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.