ఈవారం మూడు సినిమాలు విడుదల కావాల్సివుంది. ‘ది గోట్’ తో పాటుగా ’35: చిన్న కథ కాదు’, ‘జనక అయితే గనక’ రెండూ రావాలి. ‘జనక అయితే గనక’ దిల్ రాజు సినిమా. ప్రచారం బాగానే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. కొత్త విడుదల తేదీ త్వరలోనే నిర్ణయిస్తారు. అంటే ఈ వారం రెండు సినిమాలే ఉన్నాయి. ‘ది గోట్’ పై గట్టి ఫోకస్ ఉంది. విజయ్ – వెంకట్ ప్రభు కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. విజయ్ రెండు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తరవాత విజయ్ పూర్తిగా రాజకీయాలతో మమేకం కానున్నాడు. కాబట్టి ఓరకంగా విజయ్ చివరి సినిమా ఇదే అంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. అందుకే తమిళంలో విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుడల చేస్తోంది. గురువారం ఉదయం 4 గంటల నుంచే ‘ది గోట్’ ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి.
నిజానికి ఏపీ, తెలంగాణలలో వర్షాలు కాస్త తగ్గాయి. అయితే బుధవారం ఉదయం నుంచీ ఏపీలో తుఫాను మళ్లీ మొదలైంది. మరో రెండు మూడు రోజుల కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు తమ సినిమాని వాయిదా వేశారు. నిజంగానే కుండపోత వర్షాలు కురిస్తే… ‘ది గోట్’, ’35’ చిత్రాలకూ ఇబ్బందులు తప్పవు.