ఈ క్రిస్మస్ని క్యాష్ చేసుకోవడానికి రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. 21న నాని సినిమా ఎంసీఏ, 22న హలో… థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. లాంగ్ వీకెండ్ కావడం, క్రిస్మస్ సెలవు కలసి రావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదన్న ఉద్దేశ్యం రెండింటికీ ఉంది.
విక్రమ్ కె.కుమార్ సినిమాని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నాని క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. దిల్‌రాజు డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి సరంజామా మొత్తం సిద్ధం చేసేశాడు. రెండింటికీ పాజిటీవ్ టాకే వచ్చింది. రెండింటికీ మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. నాని స్టామినా నాగ్‌కి తెలుసు. విక్రమ్ సత్తా దిల్‌రాజుకి తెలుసు. అయినా ఎవ్వరూ తగ్గడం లేదు. కారణం ఒక్కటే… రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదల అవ్వడం. దానికి తోడు లాంగ్ వీకెండ్ కలసి రావడం. రెండు కాదు కదా, మరో సినిమా వచ్చినా వసూళ్లకు ఢోకా ఉండదన్న విషయం దిల్‌రాజు, నాగ్‌లకు చెప్పాల్సిన పనిలేదు.
దానికి తోడు.. నాని – అఖిల్ సినిమాల మధ్య పోటీ ఏం లేదని ముందే ఇద్దరూ క్లారిటీగా చెప్పేస్తున్నారు. ”నానికి మంచి పాలోయింగ్ ఉంది.. ఆ సినిమా కూడా బాగా ఆడాలి..” అంటూ నాగ్ పాజిటీవ్‌గా స్పందించాడు. దిల్‌రాజు కూడా అంతే. ”హలో సినిమా బాగా ఆడాలి, మా రెండు సినిమాలూ హిట్ అవ్వాలి” అంటూ పచ్చ జెండా ఊపేశాడు. నిజానికి అల్లు శిరీష్ ‘క్షణం’ కూడా క్రిస్మస్ సీజన్లోనే విడుదల అవ్వాలి. అటు నాని, ఇటు అఖిల్.. ఇద్దర్లో ఎవరు తగ్గినా శిరీష్ రంగంలోకి దిగిపోదుడు. కానీ.. ఎందుకైనా మంచిదని ఓ వారం ఆలస్యంగా వస్తున్నాడు.