ఓ బడా హీరో సినిమా విడుదలైతే చాలు. తొలిరోజు ఇన్ని వసూళ్లు వచ్చాయి, వారానికి ఇన్ని కోట్లు కొల్లగొట్టాం, ఆల్ టైమ్ రికార్డ్ మాదే అంటూ పోస్టర్లు వదులుతుంటారు నిర్మాతలు. అవి చూసుకొని సదరు హీరోల ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. ఆ లెక్కలు నిజమా, కాదా అనే విషయంలో ఫ్యాన్స్ మధ్య వార్ కూడా మొదలైపోతుంది. అయితే ఇవి అక్కడితో ఆగడం లేదు. చివరికి ఐటీ రైడ్స్ వరకూ దారి తీస్తున్నాయి. ప్రకటించిన కలక్షన్ల వివరాలు చెప్పమంటూ ఐటీ శాఖ రంగంలోకి దిగిపోతోంది. ఈ హంగామా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలక్షన్లను పోస్టర్ల రూపంలో ప్రకటించుకొన్న నిర్మాతలపై ఐటీ రైడ్స్ జరిగాయి. మైత్రీ మూవీస్ నిర్మాతలతో పాటు, దిల్ రాజుని ఐటీ అధికారులు రోజుల తరబడి ప్రశ్నించారు. కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకొన్నారు. దీనిపై ఐటీ శాఖ లోతుగా విచారణ జరుపుతోంది.
కలక్షన్ల పోస్టర్లు ఈ ఐటీ రైడ్స్ లో కీలక పాత్ర పోషించాయి. ఇన్ని తలనొప్పులు ఉన్నప్పుడు వసూళ్ల వివరాల్ని బహిరంగంగా చెప్పడం ఎందుకు? ఫేక్ లెక్కలతో ఫ్యాన్స్ ని మోసగించి, ఆ తరవాత ఆ తలనొప్పి కొని తెచ్చుకోవడం ఎందుకు? అనే చర్చ నడుస్తోంది. ఈ రైడ్స్ తరవాత కలక్షన్ల పోస్టర్లకు చెక్ పడబోతోందా? అనే ప్రశ్నకు దిల్ రాజు సమాధానం ఇచ్చారు. ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాదని, ఛాంబర్ కూర్చుని మాట్లాడుకోవాలని అన్నారు. అయితే నిర్మాతలంతా ఓ అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందన్న సంగతి మాత్రం అర్థమవుతోంది.
దిల్ రాజు ఒక్కడే… కలక్షన్ల వివరాలు దాచి పెడితే సరిపోదు. అందరూ ఇదే మాటపై ఉండాలి. ఒకరు ఫేక్ వసూళ్లతో హడావుడి చేస్తే, రెండో నిర్మాత కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు సంక్రాంతికి ఓ వైపు డాకూ మహారాజ్, మరో వైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదలయ్యాయి. రెండు సినిమాలూ పోటా పోటీగా వసూళ్ల వివరాలు పోస్టర్లపై వేశాయి. ఒకరు వేస్తే.. మరొకరు కామ్ గా ఉండలేని పరిస్థితి. ఒకర్ని చూసి మరొకరు కలక్షన్లు బయట పెట్టుకొంటూ వెళ్లిపోయారు. ఇది ఆగాలంటే.. నిర్మాతలంతా కూర్చుని మాట్లాడుకోవాలి. అసలు అంకెలే బయటకు చెప్పకపోతే, ఫేక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్యాన్స్ మధ్య కూడా వార్ తగ్గుతుంది. అయితే దిల్ రాజు చెప్పినట్టు ఇది ఒక్కరే కూర్చుని తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. చిక్కంతా పెద్ద సినిమాలతోనే కాబట్టి, పెద్ద నిర్మాతలంతా కలిసి మాట్లాడుకోవాలి.